ప్రతిదాన్నీ అనుమానించొద్దు

19-04-2024 01:24:50 AM

వీవీప్యాట్ల వినియోగం కేసు విచారణలో సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి విషయాన్ని అనుమానించటం సరికాదని పేర్కొన్నది. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యే ప్రమాదం ఉన్నదని, ఓటు వేసిప్పుడు ప్రతి ఓటుకు వీవీప్యాట్‌లు ఓటర్‌కు ఇచ్చేలా ఈసీని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో ర్యాండమ్‌గా 5 ఈవీఎంలను ఎంపికచేసి ఓటువేసినప్పుడు వీవీప్యాట్లు వచ్చేవిధంగా చర్యలు తీసుకొన్నామని కోర్టుకు ఎన్నికల సంఘం తెలిపింది.

పిటిషనర్లు కోరుతున్నట్టు ప్రతి ఓటుకు వీవీప్యాట్లు ఇవ్వటం అత్యంత కష్టంతో కూడుకొన్నదని తెలిపింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ ‘ఓటు వేసినప్పుడు వీవీప్యాట్ చూసేందుకు ఇప్పుడు 7 సెకండ్లు మాత్రమే లైట్ వెలుగుతున్నది. కనీసం ఆ లైట్ మళ్లీ ఆర్పేసేంతవరకైనా వెలిగేలా చూడాలి. ఓటరు సంతృప్తే అన్నింటికన్నా ముఖ్యం’ అని వాదించారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘మిస్టర్ భూషణ్.. మీరు చాలా దూరం వెళ్తున్నారు.

ఇది చాలా అతి. వీవీప్యాట్ కనిపించేందుకు ఏర్పాటుచేసిన గ్లాస్ పారదర్శకంగా ఉన్నా మబ్బుగా ఉన్నా అంతిమంగా ఓటరు నమ్మకమే ముఖ్యమమైనది. బల్బు వెలగటం.. వీవీప్యాట్ కనిపించటం అనేది ఓటర్ విశ్వాసానికి సహాయపడే అంశాలు మాత్రమే. ప్రతి విషయాన్నీ అనుమానించకూడదు. మీరు ప్రతి అంశాన్ని విమర్శించటం సాధ్యం కాదు. ఈసీ ఏదైనా మంచిపని చేస్తే అభినందించాల్సిన బాధ్యత మీపై ఉన్నది’ అని సూచించింది.