9 June, 2026 | 5:00 PM

దళారులను నమ్మి మోసపోవద్దు

09-06-2026 04:21 PM

- ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పారదర్శకంగా జరుగుతుంది 

- ఇల్లు ఇప్పిస్తానని డబ్బులు అడిగితే అధికారులకు ఫిర్యాదు చేయండి

- అర్హత ప్రమాణాలే కొలమానం మధ్యవర్తులకు తావులేదు

- కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్ నాయుడు స్పష్టీకరణ

చర్ల,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికీ ప్రభుత్వమే నేరుగా ఇల్లు మంజూరు చేస్తుందని చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఇళ్ల మంజూరు పేరుతో దళారులు చేస్తున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. "ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు, అర్హత ప్రమాణాల ప్రకారమే జరుగుతుంది" అని తేల్చిచెప్పారు.

దళారుల బెడద ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు లేదా పార్టీ నాయకులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. "కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేయడానికి కట్టుబడి ఉంది. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మండి. అపోహలకు తావివ్వవద్దు" అని విజయ్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం నిజమైన లబ్ధిదారులకు మేలు చేకూర్చడమేనని, మధ్యవర్తుల ప్రమేయానికి తావులేదని ఆయన పునరుద్ఘాటించారు.