30 April, 2026 | 1:54 PM

ముంబైకి చావో రేవో

29-04-2026 02:08 AM

సన్ రైజర్స్‌తో కీలక మ్యాచ్

ముంబై , ఏప్రిల్ 28 : ఐపీఎల్  2026లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఇప్పుడు డూ ఆర్ డై స్థాయికి చేరుకుంది. వాంఖడే స్టేడియంలో సస్ రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్ ముంబై భవిష్యత్తును నిర్ణయించనుంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచిన హార్దిక్ పాండ్యా సేన, ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే మిగిలిన 7 మ్యాచ్ల్లో 6 మ్యాచులలో గెలిచి తీరాల్సిందే. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్లో 103 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్, ఇప్పుడు సొంత గడ్డపై పుంజుకో వాలని చూస్తోంది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన రోహిత్ శర్మ తిరిగి రావడం ఆ జట్టుకు అతిపెద్ద ఊరట.

గాయం తర్వాత రోహిత్ శర్మ జట్టులోకి రావడం ముంబైకి కొండంత అండ. అనుభవం ఉన్న ఆటగాడిగా ఈ క్లిష్ట స్థితిలో జట్టును నడిపించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. మరోవైపు, లోకల్ బాయ్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావడం ముంబైకి అత్యవసరం. అలాగే ఇప్పటికే ఒక సెంచరీ బాదిన తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో కీలకం కానున్నాడు. ఈ సీజన్లో జస్ప్రీత్ బుమ్రా కేవలం 2 వికెట్లు మాత్రమే తీయడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. అశ్వని కుమార్, శార్దూల్ ఠాకూర్ నుంచి బుమ్రాకు సరైన సహకారం అందాల్సి ఉంది. మిచెల్ సాంట్నర్ స్థానంలో విల్ జాక్స్ లేదా కేశవ్ మహారాజ్ ఎవరో ఒకరు తుది జట్లులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇక అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లోనూ విఫలమవుతున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. విమర్శకుల నోళ్లు మూయించాలంటే ఈ మ్యాచ్లో రాణించక తప్పదు.ముంబై తమ ఇంపాక్ట్ ప్లేయర్లుగా అల్లా గజన్ఫర్, మయాంక్ రావత్, రాజ్ అంగద్ బావా, డానిష్ మలేవర్, ర్యాన్ రికెల్టన్లను అందుబాటులో ఉంచుకుంది. పరిస్థితిని బట్టి స్పిన్ సెన్సేషన్ గజన్ఫర్ను బరిలోకి దించే అవకాశం ఉంది. కావునా, వాంఖడే స్టేడియంలో ముంబై రికార్డు బాగున్నప్పటికీ, సస్ రైజర్స్ హైదరాబాద్‌ను తక్కువ అంచనా వేయలేం..

ముంబై తన ఐదు టైటిళ్ల ఛాంపియన్ ఇమేజ్‌ను కాపాడుకోవాలంటే రేపటి మ్యాచులో అద్భుతం చేయాల్సిందే. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ ఫామ్ లో ఉంది. ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్‌పై బంపర్ విక్టరీ సాధించింది. భారీ టార్గెట్‌ను అలవోకగా అందుకుం ది. బ్యాటింగ్‌లో స్టార్ ప్లేయర్స్ అంతా ఫామ్ లోకి వచ్చేశారు. బౌలింగ్‌లో కమిన్స్ కూడా రావడంతో బలపడింది.