29 April, 2026 | 3:47 AM

రఫ్ఫాడించిన రాజస్థాన్

29-04-2026 02:16 AM

ఐపీఎల్ 19వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుస విజయాలతో దుమ్మురేపిన ఆ జట్టుకు తొలి ఓటమి ఎదురయింది. భారీ స్కోరు చేసినా బౌలర్లు విఫలం అవడంతో ఓటమి రుచి చూసింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అదరగొట్టి భారీ టార్గెట్‌ను మరో 4 బాల్స్ మిగిలి ఉండగానే ఫినిష్ చేశారు.

  1. పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్
  2. సీజన్‌లో పంజాబ్‌కు తొలి ఓటమి
  3. భారీ టార్గెట్‌ను ఛేదించిన రాజస్థాన్ 
  4. మెరిసిన ఫెరీరా, జైస్వాల్, దూబే

న్యూ చండీగఢ్, ఏప్రిల్ 28: ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. హ్టుమైర్ స్థానంలో షనక, రవి బిష్ణోయ్ స్థానంలో యశ్‌రాజ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్ కూడా ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. సూర్యంశ్ షెడ్గే, లోకీ ఫెర్గూసన్ తుది జట్టులోకి వచ్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో స్టోయినిస్ 22 బంతుల్లో 62 నాటౌట్ (4 ఫోర్లు, 6 సిక్సర్లు) ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా బ్రిజేష్ శర్మ వేసిన చివరి ఓవర్లో స్టోయినిస్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఆ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4, 4 సాధించాడు.  అంతకుముందు ప్రభ్సిమ్రన్ (59) అర్ద సెంచరీతో రాణించాడు.

మిగతా పంజాబ్ ఆటగాళ్లలో  ప్రియాంశ్ ఆర్య (29), కూపర్ కన్నోల్లీ (30), శ్రేయస్ అయ్యర్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాయల్స్ బౌలర్లలో యశ్ రాజ్ పుంజా 2, ఆర్చర్, బర్గర్ తలో వికెట్ తీశారు.  అనంతరం 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్ (51), వైభవ్ సూర్యవంశీ (43) తమ సహజశైలిలో రెచ్చిపోయి రాయల్స్ గెలుపుకు గట్టి పునాది వేశారు. 51 పరుగుల వద్ద రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది.

అర్షదీప్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో వైభవ్ సూర్యవంశీ (43) ఔటయ్యాడు. తర్వాత చహల్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి జురెల్ (16) ఔటయ్యాడు.  దీంతో రాజస్థాన్105 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. అతని తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (29) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. ఇతని తర్వాత క్రీజ్లో కుదురుకున్న ఫెరియెరా, షుభమ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు.

డొనోవన్ ఫెరియెరా (52 నాటౌట్), షుభమ్ దూబే (31 నాటౌట్) ఊచకోత కోసి రాయల్స్ను విజయతీరాలకు చేర్చారు.పంజాబ్ బౌలర్లలో చహల్ 3, అర్షదీప్ ఓ వికెట్ తీశారు. కాగా ప్రస్తుత ఎడిషన్లో  పంజాబ్ (8 మ్యాచ్ల్లో 6 విజయాలు, ఒక ఓటమి వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్ 9 మ్యాచ్ల్లో 6 విజయాలతో మూడో  స్థానంలో ఉంది.

స్కోర్ బోర్డు 

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: 222/4 (ప్రబ్ సిమ్రన్ సింగ్ 59, స్టోయినిస్ 62 , కూపర్ 30, శ్రేయాస్ అయ్యర్ 30; ఆర్చర్ 1/40, రాజ్ పునియా 2/42 )

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: 228/4 (జైస్వాల్ 51, వైభవ్ సూర్యవంశీ 43, ఫెరీరా 52; చాహాల్ 3/36)