3 August, 2026 | 9:00 AM

ట్రిపుల్‌ఆర్ రూట్ ఛేంజ్?

22-06-2024 12:29 AM
  • ఉత్తరభాగం పొడవు పెరిగే అవకాశం
  • ఇప్పటికే 90 శాతం భూసేకరణ సర్వే పూర్తి
  • కోర్టు స్టేతో భువనగిరి మండలంలో స్తంభించిన సర్వే

యాదాద్రిభువనగిరి, జూన్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర మణిహారం రీజినల్ రింగ్ రోడ్డు( ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్ నిర్ధారణ,భూసేకరణ, నిధుల కేటాయింపు వంటి కీలకమైన అంశాలు తుది దశకు చేరుకున్నాయి. మరో రెండు మూడు నెలల్లో నిర్మాణ పనులకు అడుగులు పడనున్నాయి. దీంతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదిత దశ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి డివిజన్‌లో రహదారికి భూమి కోల్పోనున్న బాధితులు తీవ్ర ఆందోళనలు, న్యాయపోరాటం చేస్తున్నారు.

అయితే తాజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి నమూనా ప్రణాళికలో ట్రిపుల్‌ఆర్ కూడా ఒక మైలురాయిగా భావించి నిర్మాణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ రహదారి పొడవును పెంచుతూ అధికార యంత్రాంగం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఫలితంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అలైన్‌మెంట్‌లో మార్పులు, చేర్పులు జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పదేళ్లుగా వరుసగా వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో తమ జీవనాధారమైన భూములు కోల్పోయిన నిర్వాసితుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

10.28 కి.మీ పొడవు పెంపు

సంగారెడ్డి నుంచి ప్రారంభమయ్యే ట్రిపుల్‌ఆర్ రహదారిని ఉత్తర, దక్షిణంగా రెండు  భాగాలుగా విభజించి పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర భాగంలో సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ మీదుగా చౌటుప్పల్ వరకు 158.64 కి.మీ నిర్మాణం చేపట్టనున్నారు.  దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి ఆగనగల్లు, షాద్‌నగర్, చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు 181.87 కి.మీగా ప్రతిపాదించారు. అయితే రెండు భాగాల్లో మొదటి దశగా ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులతో డీపీఆర్ ఆమోదం కూడా పొందారు.

దాదాపు 90శాతం వరకు భూసేకరణ ప్రక్రియ సైతం పూర్తయ్యింది. అయితే భూ సేకరణలో భువనగిరి డివిజన్‌లోని రాయగిరి, ఇతర గ్రామాల్లో ఇప్పటికే దాదాపు రెండు, మూడుసార్లు భూములు కోల్పోతున్న రైతులు సర్వేను అడ్డుకున్నారు.  జైలుకు కూడా వెళ్లారు. అయినా పట్టువీడకుండా నిర్వాసితులు ఆందోళనలు చేపట్టడమే కాకుండా న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఈ పోరాటంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎంపీ, ప్రస్తుత రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కుంబం అనిల్‌కుమార్‌రెడ్డి బాధితుల పక్షాన ఉండి అలైన్‌మెంట్‌లో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నిర్మాణ పనులను త్వరతిగతిన చేపట్టడానికి అవరోధాలను అధిగమించడానికి రహదారి పొడవు పెంచాల్సివస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి అనుగుణంగా అలైన్‌మెంట్‌తో పాటు డీపీఆర్ మార్పు తప్పదని  తెలుస్తోంది. అదే జరిగితే ఉత్తర భాగంలో 158.64 కి.మీ పొడవు 161.59 కి.మీ.కు పెరగనుంది. అలైన్‌మెంట్ కూడా జగదేవ్‌పూర్ నుంచి రాజాపేట మండలం రేణికుంట, రఘునాధపురం, ఆలేరు, దిలావర్‌పూర్, మూటకొండూరు, వీరవెల్లి, గోకారం, నేలపట్ల మీదుగా చౌటుప్పల్‌కు మారే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక దక్షిణభాగంలో కూడా అలైన్ మెంట్ మార్పుతో 161.87 కి.మీ పొడవు నుంచి189.20 కి.మీ పెరగనున్నట్టు తెలుస్తోంది.