31 July, 2026 | 1:27 AM

ఇంజినీర్లనే అవమానిస్తావా?

31-07-2026 12:38 AM
  1. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు హేయం 
  2. తక్షణమే క్షమాపణ చెప్పాలి
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ 

హైదరాబాద్, జూలై 30: తెలంగాణ యువ ఇంజినీర్ల ప్రతిభను ‘క్రిమినల్ వేస్ట్‘ అంటూ వ్యాఖ్యలు చేయటం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అహంకారానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తెలంగాణ యువత సామర్థ్యాన్ని కించపరచడం, తక్కువ చేసి మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి ఏముందని ప్రశ్నించారు. రేవంత్ తన జీవితంలో ఏనాడైనా పోటీ పరీక్ష రాశారా?

ఒక్క ఉద్యోగ ఇంటర్వ్యూకైనా హాజరయ్యారా? వృత్తిపరమైన సంస్థలో పనిచేసిన అనుభవం ఉందా? అని ప్రశ్నించారు. దివాళా తీసిన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవిని కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి రేవంత్ అని.. దేశానికి సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లను అందిస్తున్న తెలంగాణ యువతను అవమానించడం దురదృష్టకరమన్నారు.  ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని  యువతకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.