ఆపరేషన్ మధ్యలో చేతులెత్తేసిన డాక్టర్
- ఎంజీఎం నుంచి సొంత ఆస్పత్రికి రిఫరల్
- ఆ తర్వాత ఆపరేషన్ కష్టమంటూ నిమ్స్‌కి వెళ్లాలని సూచన
- రోగి ప్రాణాల మీదికి తెచ్చిన కాసుల కక్కుర్తి
- హనుమకొండలోని కూరపాటి ఆస్పత్రిలో వరస ఘటనలు
హనుమకొండ, జూలై 4 (విజయక్రాంతి): హనుమకొండలోని కూరపాటి హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. శాయంపేట మండలం గోవిందపూర్ గ్రామానికి చెందిన లింగదరి రాజేశ్వరరావు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఒక రోజు కడుపులో నొప్పి రావడంతో ఎంజీఎం హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. అక్కడి వైద్యులు ఆపరేషన్ చేశారు, కానీ అక్కడే విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కూరపాటి రమేష్.. ఆపరేషన్‌లో పేగు కట్ అయిందని వెంటనే తమ సొంత క్లినిక్ కూరపాటి హాస్పిటల్‌కు తరలిస్తే తిరిగి ఆపరేషన్ చేసి బాగు చేస్తానని రోగి బంధువులకు హామీ ఇచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే రాజేశ్వరరావును హన్మకొండలోనే కూరపాటి హాస్పిటల్‌కు తరలించారు.
డాక్టర్ కూరపాటి రమేష్ సర్జరీ చేస్తూ మధ్యలో బయటకు వచ్చి కుట్లు వేయడం ఇబ్బంది అవుతుందని, వెంటనే నిమ్స్‌కు తరలించాలని సూచించారు. దానితో హుటా హుటినా రాజేశ్వరరావును బంధువులు నిమ్స్‌కు తరలించారు. అక్కడ పేషెంట్ పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు పేషెంట్ ను అడ్మిట్ చేసుకునేందుకు వెనకాడగా వెంటనే పరిస్థితి అర్థం చేసుకున్న బంధువులు యశోద ఆసుపత్రికి తరలించి లక్షలాది రూపాయలు వెచ్చించి వైద్యం అందించారు. వైద్యమే తెలియని కూరపాటి రమేష్ తమ ప్రాణాలతో చెలగాట మాడారని రోగి బంధువులు ఆరోపిస్తూ, ఆ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు.






