29-07-2025 05:22:01 PM
అంటు వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించాలి
రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పీడీ వాసం వెంకటేశ్వర్ రెడ్డి
మహబూబాబాద్ (విజయక్రాంతి): సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, అంటువ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాలని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వెంకటేశ్వర్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లోని బయ్యారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా డెంగ్యూ జ్వర పీడితులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ద్వారా వారికి అందిన వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయ్యారం ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పనితీరుపై తనిఖీ చేశారు. వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిని సందర్శించారు. ఫీవర్ వార్డును, ఫార్మసి స్టోర్, ల్యాబ్, సంపూర్ణ సురక్ష కేంద్రం సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు.
జనరల్ ఆస్పత్రికి రోగులు అధికంగా వస్తున్న నేపథ్యంలో పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మున్సిపల్, పంచాయతీ శాఖల సమన్వయంతో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, శానిటేషన్ నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో వైద్య అధికారులు, సిబ్బంది నిత్యం పర్యవేక్షించాలన్నారు. తరచుగా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, రాపిడ్ టెస్ట్ చేయాలని, నీటి వృధాను అరికట్టాలని, మురుగు నీరు నిలవకుండా చూడాలని, బ్లీచింగ్ చేయాలని, దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు డిఎంహెచ్వో డాక్టర్ రమేష్ రాథోడ్, డిపిఓ హరిప్రసాద్, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, వైద్య శాఖ అధికారులు ప్రసాద్, రాజు పాల్గొన్నారు.