వేసవిలో మసాలాలు వద్దు

01-05-2024 02:11:06 AM

రోజుకి కనీసం 4 లీటర్ల నీరు తాగాలి

పీచు పదార్థాలు, కూరగాయలు తినాలి

సీజనల్ పండ్లు ఆరోగ్యానికి మంచిది

ఎండాకాలంలో జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఈ వేసవిలో విపరీతమైన ఎండలు, తీవ్ర వడగాలులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, గర్భిణిలు, బాలింతలు, వృద్ధులు వేడిమి తాళలేక నీరసించిపోతున్నారు. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా వీలైనంతా ఎక్కువగా నీరు తాగాలని చెబుతున్నారు. నాన్ వెజ్, మసాలా పదార్థాలకు దూరంగా ఉంటూ, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలని సలహా ఇస్తున్నారు.

సీజనల్ పండ్లు ఆరోగ్యానికి ఔషధం..

ప్రకృతి మనకు కాలానికి అనుగుణంగా పండ్లను అందిస్తుంటుంది. కానీ, మనం అవేమి పట్టించుకోకుండా నచ్చిన పదార్థాలను తింటూ అనారోగ్యాల బారినా పడుతుంటాం. తినే పదార్థాలపై పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేసవి కాలంలో ముఖ్యంగా ఎలక్ట్రోలైట్ పోషకాల కోసం.. నీరు, కొబ్బరి నీరు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, నిమ్మరసం, చెరకు రసం, పుదీనా జ్యూస్, మజ్జిగ, తాటి ముంజలు, మొర్రి పండ్లు, పుచ్చకాయలు వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఐరన్ కోసం జామ, నారింజ, మామిడి పండ్లు, కివీ, దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్ వంటివి తినాలని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఐరన్‌ను నిరోధించే కాఫీ వంటి కెఫెన్ పదార్థాలకు దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు. నాన్‌వెజ్ వంటకాలు, వేపుళ్లు, ఫాస్ట్‌ఫుడ్ పదార్థాలు, బేకరీ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలని, అలాగే చల్లదనం కోసం తాగే కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివి కావని హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్తలు పాటించాలి

వేసవి కాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మహిళలు, గర్భిణిలు త్వరగా జీర్ణమయ్యే పదార్థాలనే ఎక్కువగా తీసుకోవాలి. పిజ్జా, బర్గర్లు, చిప్స్, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు పెంచే మసాలాలు, పచ్చళ్లు, పులుపు ఆహారాలను తగ్గించాలి. రోజులో ఒకేసారి ఎక్కువగా తినే బదులు, కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తినాలి. 

 జీఎం సుబ్బరావు (సీనియర్ సైంటిస్ట్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్