భూమి తారుమారుపై పిటిషన్

02-05-2024 12:17:17 AM

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచనపల్లిలోని సర్వే నెంబరు 442లోని 31 ఎకరాల భూమిని ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదుకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ అదే మండలానికి చెందిన బొప్పి మహేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ విజయసేన్‌రెడ్డి విచారించారు. సర్వే నెంబరు 442లోని భూమి తమ ముత్తాత పోచయ్య పేరిట ఉందని, ఆయన చనిపోయారని పిటిషనర్ న్యాయవాది చెప్పా రు. 2017లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర భూమి సర్వేలో కూడా పోచయ్య పేరు మీదే భూమి ఉందన్నారు.

ఆ తర్వాత రైతు బంధు కూడా అధికారులు రెడీ చేశారని, పిటిషనర్ల కుటుంబసభ్యుల విభేదాల కారణంగా  మ్యుటేషన్ జరగ లేదన్నారు. వారసుల్లో ఒకరు భాగపరిష్కారం కోసం సివిల్ కోర్టును ఆశ్రయిస్తే ఆ భూమి చేగూరి రమేశ్ పేరిట ఉందని చెప్పారన్నారు. పిటిషనర్ కుటుంబానికి చెందిన ఆస్తిని సయ్యద్ రహీం ఉద్దీన్, సయ్యద్ ఇంతియాజ్ ఉద్దీన్‌కు విక్రయించగా వాళ్లు మరికొందరికి విక్రయించారని చెప్పారు. కొనుగోలు చేసినవారిలో వెంకటసునీల్, కృష్ణస్వామి, బొత్స సందీప్, మహమ్మద్ ప్రహీముద్దీన్ ఉన్నారన్నారని వివరించారు. వాదనల తర్వాత హైకోర్టు విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.