డాక్యుమెంటేషన్ వర్తమాన సమాజానికి మార్గదర్శి
కేయూ వీసీ కే.ప్రతాప రెడ్డి
హనుమకొండ, ఏప్రిల్ 15(విజయక్రాంతి): సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రజా సంబంధాల (పి ఆర్ ఓ) కార్యాలయం ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంబంధించిన పత్రికా, మీడియా క్లిప్పింగ్స్ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికను కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, ఓఎస్డి ఆచార్య వెంకట్రాంరెడ్డి, ఆరట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి బుధవారం లాంఛనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ మాన్యువల్ డాక్యుమెంటేషన్ ప్రస్తుత సమాజంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని పేర్కొన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా పత్రాల రూపంలో సమాచారాన్ని భద్రపరచడం అవసరం తగ్గలేదని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు సరైన ఆధారాలు అందించడంలో డాక్యుమెంటేషన్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మాట్లాడుతూ ఆరట్స్ కళాశాల పౌర సంబంధాల విభాగం చేపట్టిన ఈ కార్యక్రమం విశేష ప్రాశస్త్యాన్ని సంతరించుకుందని తెలిపారు. వివిధ సందర్భాల్లో పత్రికలు, మీడియా ద్వారా వెలువడిన వార్తలను ఒకే చోట సమగ్రంగా సమీకరించడం విద్యాసంస్థకు గౌరవాన్ని తీసుకువస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి, కేయూ మాజీ ఈసీ సభ్యులు ఆచార్య బత్తిని చంద్రమౌళి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ రెహ్మాన్, ఆరట్స్ కళాశాల పౌర సంబంధాల అధికారి డాక్టర్ ఆదిరెడ్డి, అధ్యాపకులు డాక్టర్ ఆశీర్వాదం, డాక్టర్ శ్రీధర్ కుమార్, డాక్టర్ సుచరిత, డాక్టర్ జితేందర్, హరికుమార్, కేయూ పీఆర్‌ఓ డాక్టర్ పృధ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.






