‘పిల్లలకు కూడా హెల్మెట్ అవసరం’
ఎస్పీ డాక్టర్ శబరీష్
మహబూబాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): ద్విచక్ర వాహనదారులు తమ ప్రయాణ సమయంలో పిల్లలకు కూడా హెల్మెట్ ధరింపజేయడం అనివార్యమని, కొద్ది దూరమే కదా అనే నిర్లక్ష్యం పనికిరాదని, ప్రమాదం ఏ క్షణంలోనైనా రావచ్చనే అభిప్రాయంతో రక్షణ చర్యలు చేపట్టాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ పట్టణ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఆర్రైవ్ అలైవ్ 2026 కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు రోడ్డు భద్రత పై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో తమ పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే తల్లిదండ్రులు, వారి పిల్లలు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజలలో చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పిల్లల భద్రత, ప్రతి తల్లిదండ్రి యొక్క ప్రథమ బాధ్యత అని తెలిపారు. చిన్న దూరం ప్రయాణం అయినా, ‘ఇప్పుడు అవసరం లేదు’అనే నిర్లక్ష్యం ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమని, హెల్మెట్ ఒక్కటే ప్రాణాలను రక్షించే ప్రధాన భద్రతా సాధనం అని పేర్కొన్నారు.
పిల్లలను ముందుగా కూర్చోబెట్టి లేదా వెనుక కూర్చోబెట్టి ప్రయాణించే సమయంలో వారికి సరిపోయే సైజ్ హెల్మెట్ తప్పనిసరిగా పెట్టాలని సూచించారు. హెల్మెట్ సరైన విధంగా బిగించి పెట్టకపోతే ఉపయోగం ఉండదని, కాబట్టి సరిగ్గా ధరించడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. అలాగే, ఒక్క కుటుంబం మాత్రమే కాకుండా సమాజం మొత్తం ఈ నియమాన్ని పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పిల్లలు తమ తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించమని గుర్తు చేయడం ద్వారా మంచి మార్పు తీసుకురాగలరని, రోడ్డు భద్రత కుటుంబ స్థాయి నుంచే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వేగ పరిమితులు పాటించడం, ట్రిపుల్ రైడింగ్ నివారించడం, ట్రాఫిక్ నియమాలను గౌరవించడం వంటి అంశాలు కూడా రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో కీలకమని వివరించారు.ప్రతి తల్లిదండ్రి తమకు మాత్రమే కాకుండా తమ పిల్లలకు కూడా హెల్మెట్ పెట్టి ప్రయాణించడం ద్వారా బాధ్యతాయుత పౌరులుగా నిలవాలని, ఇతరులకు ఆదర్శంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని గుర్తుంచుకుని, హెల్మెట్ వినియోగాన్ని కచ్చితంగా పాటించాలని ఈ సందర్బంగా విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా ఎస్పీ తన కూతురు శ్రేయాన్ కు హెల్మెట్ ధరింపజేసి మోటార్ సైకిల్ పై ర్యాలీలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.






