4 April, 2026 | 4:22 AM

తెలంగాణ ఆణిముత్యం దొడ్డి కొమరయ్య

04-04-2026 03:06 AM

ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడు 

మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి 

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): తెలంగాణ ఆణిముత్యాల్లో దొడ్డి కొమరయ్య ఒకరని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి పేర్కొన్నారు. ఆత్మ గౌరవం కోసం ప్రాణాలను సైతం తెగించి పోరాటం చేసిన గొప్ప యోధుడని కీర్తించారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య జయంతి సం దర్భంగా తెలంగాణ భవన్‌లో వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఆత్మగౌరవం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో విసునూరి రామచంద్రారెడ్డి అరాచకాలను ఎండగట్టారని, పోరాట పటిమను చూపారని అన్నారు. సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అం దించిన మహానీయులన్నారు.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అన్యాయానికి గురవుతున్న తెలం గాణను చూడలేక 2001లో కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడి ఆదర్శప్రాయంగా నిలి చారని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణను పదేళ్లపాటు సుస్థిరంగా అభివృద్ధి చేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు, గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఆత్మగౌరవంపై దెబ్బ కొడితే ఊరుకునేది లేదని తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు. దొడ్డి కొమరయ్య నుంచి మనమందరం స్ఫూర్తి పొంది ప్రజలను చైతన్యవంతులు చేయాలని మధుసూదనా చారి పిలుపునిచ్చారు.