తల్లిదండ్రులపై ఫీజుల భారం!
- తగ్గించాలంటూ స్కూళ్ల ముందు నిరసనలు
- పట్టించుకోని ప్రభుత్వాలు
- ఫీజుల నియంత్రణ చట్టానికి లభించని మోక్షం
హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి తల్లిండ్రులకు అత్యంత మోయలేని భారం తమ పిల్లల స్కూల్ ఫీజుల అంశం. ప్రతి ఏటా 20 నుంచి 30 శాతం వరకు ఫీజులను ఇష్టానుసారంగా కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పెంచుకుంటూ పోతుండడంతో ఇది వారికి పెద్ద సమస్యగా మారింది. ఈఅంశంలో ప్రభుత్వా లు కూడా ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఏం చేయాలో తెలియకే వారే స్వయం గా ఆయా స్కూళ్ల ముందు నిరసనకు దిగుతున్నారు.
ఫీజులు భారీగా పెంచుతున్నారని ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులను నియంత్రించాలనే డిమాండ్ కొన్ని సంవత్సరాలుగా ఉంది. కానీ దీన్ని ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలున్నాయి. ప్రతి విద్యాసంవత్సరం ప్రారంభం ముందు ఫీజు అంశం తెరమీదకు రావడం, ఫీజులను కట్టడి చేస్తామంటూ ప్రభుత్వాలు ప్రకటించ డం షరామామూలుగా తయారైంది. ఫీజుల నియంత్రణకు చట్టం తెచ్చేందుకు బిల్లు సిద్ధమై ఏడాదవుతున్నా అది కార్యరూపం దాల్చలేదు.
దాదాపు నెల రోజుల క్రితం కూడా ఫీజుల నియంత్రణకు కమిటీని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక జూన్ 12 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్, సీబీఎ స్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల పాఠశాలలైతే అడ్మిషన్లు కూడా చేపడుతున్నాయి. పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని 2022 జనవరి 17న జరిగిన మంత్రివర్గ సమావేశంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానిపై క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది.
ఆ కమిటీ కూడా ఏటా 10 శాతం పెంచుకోవచ్చని ప్రభుత్వానికి సిఫార్సు చేసినా దానిపై నిర్ణయం తీసుకోలేదు. ఆతర్వాత వచ్చి న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫీజులను కట్టడి చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని 2024లో ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర విద్యాకమిషన్ తెలంగాణ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా పేరుతో జనవరి 2025లో ప్రభుత్వానికి నివేదిక అందించింది.
పాఠశాలల ఫీజులను నియంత్రించాలని తెలంగాణ విద్యావిధానం- పేరుతో ఇచ్చిన నివేదికలోనూ స్పష్టం చేసింది. కానీ ఫీజు నియంత్రణ అంశం మాత్రం పరిష్కారం కాలేదు. వెంటనే ప్రభుత్వం ఫీజుల కట్టడిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.




