దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం అని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దొడ్డి కొమురయ్య 99వ జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ వెనుకబడిన తరగతుల సహాయ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ , సంఘ నాయకులు యాదగిరి,తో కలిసి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహానుభావుడని తెలిపారు. అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా ఆయన చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. కొమురయ్య చూపిన ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు.
ప్రజల హక్కులు, సమానత్వం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినవారమవుతామని తెలిపారు. సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహనీయులను కులం, వర్గం అనే పరిమితుల్లో చూడకుండా వారి ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీ.సీ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




