19-11-2025 12:00:00 AM
ఏఐఎన్యూ ఆస్పత్రి డాక్టర్ దీపక్ రాగూరి
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): ఆరోగ్యంపై అశ్రద్ధ వహించొద్దని, జాగ్రత్తలు పాటించక మగవారిలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్ దీపక్ రాగూరి, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఏఐఎన్యూ ఆస్పత్రి అన్నారు. బుధవా రం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సామాజిక పరిస్థితుల కారణంగా చాలామంది పురుషులు సీరియస్ అయ్యేవరకు తమ ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోరు.
పురుషుల యూరలాజికల్ ఆరోగ్యం పుట్టుకతోనే మొదలవుతుంది. తల్లిదండ్రులు ముందుగా పిల్లల వైద్యుడిని కలుస్తారు గానీ, జీవితాంతం ప్రభావం చూపే సమస్యలు ఏమైనా ఉన్నాయా.. వాటిని ఎలా పరిష్కరించాలన్న విషయాలను మాత్రం చూడాల్సింది పీడియాట్రిక్ యూరాలజిస్టులే. వృషణాలు కిందకి రాకపోవడం, పుట్టుకతోనే కొన్ని సమస్యలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కొన్ని అవయవాలు సరిగా అభివృద్ధి చెందకపోవడం లాంటి వాటిని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు.
ఫైమోసిస్, నొప్పితో కూడిన ఫోర్స్కిన్ రిట్రాక్షన్, యుక్తవయసులో వచ్చే మార్పులు, లైంగిక ఆరోగ్య సందేహాల లాంటి అంశాలపై బాలురకు స్పష్టమైన మార్గదర్శకత దొరకకపోవడం వల్ల సమస్యలు కొన్నేళ్ల పాటు కొనసాగుతున్నాయి. యుక్తవయసులో ఉండే చాలమంది ఈ సమస్యల గురించి మాట్లాడేందుకు ఇబ్బంది పడతారు. పాఠశాలలు, క్లినిక్లు, కుటుంబాలలో బాలురకు ఇలాంటి సంభాషణల కోసం సురక్షిత వాతావరణం అవసరం.
అలాంటిచోట పిల్లలు నేర్చుకుని, ప్రశ్నలు అడిగి, సరైన సమయానికి ఎలాంటి మొహమాటం లేకుండా తగిన వైద్యపరమైన మార్గద ర్శకత్వం పొందాలి. 20ల నుంచి 40ల వరకు వచ్చేసరికి పురుషులు ఉద్యోగాల్లో పడతారు. ఎక్కువ పనిగంటలు, ఒత్తిడి, జీవనశైలి అలవాట్లు సరిగా లేకపోవడం, సరైన నిద్రలేక పోవడం వల్ల సంతానసాఫల్యం, లైంగిక పటు త్వం, యూరినరీ ఆరోగ్యం పాడవుతాయి. ఈ వయసులోనే ప్రోస్టేట్ వాపు.. అంటే ప్రోస్టేటైటిస్ అనే వ్యాధి ఎక్కువ.
కటిప్రాంతంలో నొప్పి, లైంగిక పటుత్వం ఉన్నట్టుండి పడిపోవడం లాంటివి కనిపిస్తాయి. అయినా చాలా మంది పురుషులు దీన్ని పట్టించుకోరు. వీటిని త్వరగా గుర్తించి చికిత్స చేయించుకుంటే ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు దీర్ఘకాల సమ స్యలు తగ్గుతాయి. ఎప్పటికప్పుడు యూరాలజిస్టును సంప్రదించడం అనేది ఇప్పుడు పునరుత్పాదక ఆరగ్యానికి, సమగ్ర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది’ అన్నారు.
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ)లో ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించాలనుకుంటున్నాం. కార్యాలయాల్లో, పాఠశాలల్లో, సమాజంలో అవగాహన శిబిరా లు నిర్వహించడం ద్వారా పురుషుల ఆరో గ్యం గురించి చర్చించాలి’ అని వివరించారు.