1 March, 2026 | 8:24 AM

కుడి ఎడమల కూల్చివేతలే!

01-03-2026 01:17 AM
  1. ‘మూసీ’ పేరిట ఇండ్లపై బుల్డోజర్లు! 
  2. నగరవ్యాప్తంగా దుమారం
  3. హెచ్‌సీయూ ఆక్రమణ నుంచి ఖమ్మం కూల్చివేతల వరకు..

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాల తొలగింపు పేరుతో కూల్చివేతలు పరంపరగా కొనసాగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణ, అభివృద్ధి, ప్రక్షాళన పేరుతో చేపడుతున్న ఈ చర్యలు.. చివరకు పేదల ఇండ్లను నేలమట్టం చేస్తున్నాయనే ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

నగర అభి వృద్ధి, నది ప్రక్షాళన పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలు పేదల జీవితాలను చిదిమేస్తున్నాయని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అక్రమ నిర్మాణాల తొలగింపు పేరుతో నోటీసులు ఇవ్వకుండానే.. ప్రత్యామ్నా య వసతి కల్పించకుండానే ఇండ్లను కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మూసీ నది ప్రక్షాళన పేరుతో నది పరివాహక ప్రాంతా ల్లో భారీ స్థాయిలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

దశాబ్దాలుగా నివసిస్తున్న కాలనీలను ఒక్కసారిగా అక్రమ నిర్మాణాలుగా ప్రకటించి బుల్డోజర్లు నడపడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.ఇక్కడ దశాబ్దాలుగా ఇక్కడే ఉంటు న్నాం. ప్రభుత్వమే విద్యుత్, నీటి కనెక్షన్లు ఇచ్చింది. ఇప్పుడు ఒక్కసారిగా మా ఇండ్ల్లు అక్రమమంటున్నారు. మేముఎక్కడికి వెళ్లాలి? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలోనూ ఇదే దృశ్యం కనిపించింది. పేదలు అప్పులు చేసి, కష్టపడి కట్టుకున్న ఇండ్లను అధికారులు కూల్చివేయడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఒక్కసారిగా వచ్చి ఇళ్లను నేలమట్టం చేశారని బాధి తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి, నగర ప్రక్షాళన పేరుతో చేపడుతున్న చర్యలు పేదల జీవనాధారాన్ని నాశ నం చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూల్చివేతల తర్వాత పునరావా సంపై స్పష్టత లేకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర అనిశ్చితిలో ఉన్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు నిరాశ్రయులుగా మారి బహిరంగ ప్రదేశాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు.

ఖమ్మం కూల్చివేతల వరకు.. 

కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొద్ది కాలానికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిధిలోని భూముల ఆక్రమణల తొలగింపు చర్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో అధికారులు చేపట్టిన కూల్చివేతలపై విద్యార్థులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారడం తో, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు జోక్యంతో ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

దీంతో ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతల విధానంపై అప్పుడే ప్రశ్నలు తలెత్తాయి. తర్వాత హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) ఏర్పాటుతో కూల్చివేతలు మరింత వేగం పుంజుకున్నాయి. చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూముల ఆక్రమణల పేరుతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇండ్ల, నిర్మాణాలను తొలగించారు. ప్రభు త్వం దీనిని అక్రమాల తొలగింపుగా సమర్థించుకుంటుండగా, బాధితులు మాత్రం తమకు నోటీసులు ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా ఇండ్ల కూల్చివేస్తున్నారని ఆరోపిస్తు న్నారు.

ఇప్పుడు ఈ కూల్చివేతల పరంపర ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల ప్రాంతానికి చేరుకుంది. దశాబ్దాలుగా నివసిస్తున్న పేదల ఇండ్లను అధికారులు కూల్చివేయడంతో కుటుంబాలు ఒక్కసారిగా నిరాశ్రయులయ్యా యి. అప్పులుచేసి, కష్టపడి కట్టుకున్న ఇండ్ల కూలిపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో నిలిచారు. తమకు ముందుగా ఎలాం టి పునరావాసం కల్పించలేదని, ప్రత్యామ్నాయ వసతి చూపలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌సీయూ భూముల నుంచి ఖమ్మం వెలుగుమట్ల వరకు అక్రమాల తొలగింపు పేరుతో సాగుతున్న కూల్చివేతలు.. అభివృద్ధి అంటే పేదల గూళ్లను నేలమట్టం చేయడమా అనే ప్రశ్నను మళ్లీ ముందుకుతెచ్చింది.

రోడ్డునపడ్డ వేలాది కుటుంబాలు..

రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువుల పరిరక్షణ, మూసీ ప్రక్షాళన పేరుతో చేపడుతున్న కూల్చివేతలు వేలాది కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. అధికారిక, స్థానిక అంచనాల ప్రకారం రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాలు, జిల్లా ల్లో భారీ స్థాయిలో ఇండ్ల తొలగింపు జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే అత్యధిక ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ సుమారు 2,500కు పైగా ఇండ్లు నేలమట్టం అయ్యా యి. ఈ కూల్చివేతలతో 8,000కు పైగా కుటుంబాలు నిర్వాసితులయ్యాయని అంచనా.

రంగారెడ్డి జిల్లాలో కూడా సుమా రు 800కు పైగా ఇండ్ల తొలగించగా, 2,500 కు పైగా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఖమ్మం జిల్లాలో సుమారు 300 కు పైగా ఇండ్లు ప్రభావితమయ్యాయి. ఈ చర్యలతో దాదాపు 1,000 కుటుంబాలు నివాసం కోల్పోయినట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో కూడా చెరువులు, కాలువల ఆక్రమణల తొలగింపు పేరుతో సుమారు 400కు పైగా ఇండ్లకూల్చివేశారు. దీని వల్ల 1,200కు పైగా కుటుంబాలు నిర్వాసితులయ్యాయి.

ఇతర ప్రాంతాలను కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా మరో 300కు పైగా ఇళ్లు ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల్లో సు మారు 1,000 కుటుంబాలు నివాసం కో ల్పోయినట్లు అంచనా. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా 4,000కు పైగా ఇండ్లు ప్రభా వితమవగా, 13,000కు పైగా కుటుంబాలు నిర్వాసితులయ్యాయని అధికారిక, స్థానిక అంచనాలు చెబుతున్నాయి. అభివృద్ధి, ప్రక్షాళన పేరుతో చేపడుతున్న ఈ చర్యలు ఒక వైపు నగరాల పరిరక్షణకు దోహదపడుతుండగా, మరోవైపు వేలాది పేద కుటుంబా ల జీవితాలను అనిశ్చితిలోకి నెట్టేశాయి.

రాజకీయ దుమారం..

 రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతల చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చ కు దారితీశాయి. ముఖ్యంగా హైడ్రా ద్వారా చెరువులు, నది పరివాహక ప్రాంతాలు, ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను తొలగించడం రాజకీయంగా వివాదా స్పదమైం ది. ప్రభుత్వం మాత్రం ఇవి అక్రమ నిర్మాణాల తొలగింపే అని, నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి, చెరువులను పరిరక్షించడానికి తప్పనిసరి చర్యలని చెబుతోంది.

దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ నేతలు ఈ చర్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. పేదల ఇళ్లపైనే బుల్డోజర్లు నడుస్తు న్నాయని, పెద్దల అక్రమ నిర్మాణాలను మా త్రం వదిలేస్తున్నారని, ముందుగా పునరావాసం కల్పించకుండా కూల్చివేయడం అ మానుషమని, రాజకీయ కక్షసాధింపే లక్ష్యం గా ప్రభుత్వం కూల్చివేతలు చేపడుతుందని ఆరోపిస్తున్నారు.

ఇది అభివృద్ధి కాదు, పేదల జీవితాల విధ్వంసం అని బీఆర్‌ఎస్ విమర్శిస్తున్నది. బాధితులకు అండగా నిలు స్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. అటు బీజేపీ కూడా ప్రభుత్వ చర్యలపై ప్రశ్న లు లేవనెత్తింది. పునరావాసం కల్పించిన తర్వా తే కూల్చివేతలు చేయాలని, ఒకే విధానాన్ని అందరికీ వర్తింపజేయాలని సూచిస్తున్నది. పేదలపై వివక్ష చూపకూడదని చెబుతున్నది. 

అప్పుడు అనుమతులు.. ఇప్పుడు అక్రమాలా?.. 

మూసీ నది పరివాహక ప్రాంతాల్లో చేపట్టిన కూల్చివేతలతో చాదర్‌ఘాట్, మలక్‌పేట్, అఫ్జల్‌గంజ్, కార్వాన్, యాకత్‌పురా, ముసారాంబాగ్, పునాణాపూల్‌లో వరద ప్రమాద నివారణ పేరుతో ఇండ్ల తొలగించారు. హైడ్రా చర్యలలో భాగంగా మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, ఖాజాగూడ, గచ్చిబౌలి, నార్సింగి, మణికొండ, షేక్‌పేట్, బంజారాహిల్స్ పరిసరాల్లో లేఅవుట్లు, ఫెన్సింగ్లు, షెడ్లు, కొన్ని నివాస నిర్మాణాలు తొలగించారు.

చెరువుల ఆక్రమణల తొలగింపు పేరుతో దుర్గం చెరువు పరిసరాలు, తమ్మిడికుంట చెరువు, నల్లచెరు వు, ఎక్రుంట, బతుకమ్మ కుంట, పెద్ద చెరువుల పరిసర కాలనీల్లో కూల్చివేతలు చేపట్టా రు. ప్రభుత్వ భూముల ఆక్రమణ పేరుతో ఖమ్మంలోని వెలుగుమట్ల ప్రాంతంలో పేదల ఇండ్ల కూల్చివేశారు. చెరువుల ఆక్రమణలు, రోడ్డు విస్తరణ పేరుతో వరంగల్‌లో నిర్మాణాలు తొలగించారు. రంగారెడ్డి జిల్లా లో నార్సింగి, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, ఆదిభట్లలో ప్రభుత్వ భూముల ఆక్ర మణలపై కూల్చివేతలు జరిగాయి.

అభివృద్ధి పేరిట ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలపై దశాబ్దాలుగా నివసిస్తున్న కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. విద్యుత్, నీటి కనెక్షన్లు ఇచ్చింది ప్రభుత్వమే.. ట్యాక్సులు తీసుకున్నది ప్రభుత్వమే, ఇప్పుడు ఒక్కసారిగా అక్రమాలంటూ ఇళ్లు కూల్చడం న్యా యమా? అని ప్రశ్నిస్తున్నారు. మాకు ఇండ్లు కట్టుకునేందుకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లమంటున్నాయి? అని బాధితులు నిలదీస్తున్నారు.