6 May, 2026 | 11:51 AM

హామీలొద్దు.. ముందు మంచినీళ్లు ఇవ్వండి

10-03-2025 12:50 AM
  • ఖాళీ బిందెలతో పద్మశ్రీ హిల్స్  వాసుల ఆందోళన 
  • ఆందోళనకారులతో మాట్లాడిన ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షుడు
  • ఫోన్లో ఉన్నతాధికారులతో మాట్లాడిన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 
  • వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి హామీ 

రాజేంద్రనగర్, మార్చి 9 (విజయ క్రాంతి): బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మశ్రీ హిల్స్ వాసులు రెండో రోజు ఆదివారం ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. కొన్ని సంవత్సరాలుగా మంచినీటి సమస్య పరిష్కారానికి తాము వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లిన నిమ్మకు నీరెత్తుతున్నట్లు వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పద్మశ్రీ హిల్స్ నుంచి ర్యాలీగా బయలుదేరి వచ్చి సన్ సిటీలోని ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. మంచినీరు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు...? అని ఈ సందర్భంగా సర్కారుకు వ్యతిరేకంగా మహిళలు, పురుషులు తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. తాము అన్ని విధాలుగా పన్నులు చెల్లిస్తున్నామని, మరి ప్రభుత్వం మంచినీరు ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పద్మశ్రీ హిల్స్ వాసుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు.

వెంటనే ఆయన ఫోన్ లో జలమండలి తోపాటు ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. సమస్య పరిష్కారానికి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

పద్మశ్రీ హిల్స్ కు సరిపోయినంత మంచినీరు అందించేందుకు తనవంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. వారం రోజుల్లో సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ఆయన వారికి తెలియజేశారు. దీంతో ఆందోళనకారులు ధర్నా విరమించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.