23 July, 2026 | 7:20 PM

ట్యాక్స్ రెవెన్యూ రెండింతలు

29-06-2024 12:05 AM
  • ఏప్రిల్‌లో రూ.11,464.17 కోట్లు వసూలు

మే నెలలో రూ.22,419.13 కోట్ల రాబడి

భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు

కాగ్ నివేదికలో వెల్లడి

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): తెలంగాణకు సంబంధించిన 2024 మే నెల ఆదాయం, వ్యయాలతో ఇతర లావాదేవీల వివరాలతో కూడిన నివేదికను కేంద్రానికి కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అందజేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఆదా యం మెరుగైంది. కానీ ద్రవ్యలోటు మాత్రం భారీగా పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యలోటు రూ.2,246.62 కోట్లు కాగా మేలో అది ఏకంగా రూ.7,380.27 కోట్లకు పెరిగింది. అయితే 2023 మే (రూ.9,266.42 కోట్లు)తో పోలిస్తే తగ్గడం కాస్త ఉపశమనం ఇచ్చే అంశం. ఖజానాకు ఆదాయం తెచ్చే వాణిజ్య పన్నుల శాఖపై తెలంగాణ సర్కారు ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ట్యాక్స్ వసూళ్లను 100శాతం వసూలు చేసే లా ఉద్యోగులకు దిశానిర్దేశం చేసింది.

ఈ క్రమంలో మే నెలలో మంచి ఫలితాలను ఇచ్చినట్లు కనిపిస్తోంది. గత నెల ట్యాక్స్ రెవె న్యూ రూ.11,464.17 కోట్లు కాగా ఈ నెలలో ఏకంగా రెండింతలై రూ.22,419.13 కోట్లకు చేరుకున్నట్లు కాగ్ నివేదిక చెబుతోంది. గతేడాది మేలో ట్యాక్స్ రెవెన్యూ రూ.20,097. 73 కోట్లు మాత్రమే వసూలైంది. మేలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. ఏప్రిల్‌లో రూ.4,475.57 కోట్లు రాగా మేలో మాత్రం ఏకంగా రూ.8,187.46 కోట్లు రావ డం గమనార్హం.

అదే విధంగా మే నెలలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగింది. రాష్ట్రం మొత్తం ఆదాయాన్ని అప్పులతో కలి పి లెక్కించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పద్ధతిలోనే మే నెల ఆదాయాన్ని కాగ్ లెక్కగట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 14,068.41కోట్లు కాగా మే నెల రాబడి ఏకంగా రూ.30,534.32 కోట్లు కావడం గమనార్హం. అయితే గతేడాది మే (రూ.31,699.99 కోట్లు)తో పోలిస్తే ఈ ఏడా ది తక్కువ ఆదాయం రావడం గమనార్హం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటమే ఆదా యం తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.

  1. స్టాంపులు, రిజిస్ట్రేషన్ ద్వారా మేలో రూ. 2,189.91 కోట్లు ఆదాయం రాగా ఇదే ఏడాది ఏప్రిల్‌లో రూ.1,116.33 కోట్లు వచ్చింది. గతేడాది మేలో రూ.2,358.55 కోట్లు వసూలు కావడం గమనార్హం. 
  2. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం తెచ్చే శాఖల్లో ఆబ్కారీ శాఖ కీలకమైనది. గతేడాది మేలో ఎక్సైజ్ సుంకం రూ. 2,683.92కోట్లు వసూలు కాగా ఈ ఏడా ది రూ.3,321.23కోట్లు వసూలైంది. ఇదే ఏడాది ఏప్రిల్‌లో రూ.1,580.43కోట్లు మాత్రమే వచ్చింది. 
  3. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ మాదిరిగానే మే నెలలోనూ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. 
  4. ఈ ఏడాది మేలో సేల్స్ ట్యాక్స్ వసూళ్లు రూ.5,459.02కోట్లు కాగా గతేడాది ఇదే నెలలో రూ.4,802.96 కోట్లు మాత్రమే వచ్చినట్లు కాగ్ నివేదిక చెబుతోంది.
  5. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.1,865.15 కోట్లను వడ్డీ కింద చెల్లించింది. మే నెలలో ఏకంగా రూ. 3,729. 19 కోట్లను కట్టింది. ఇదే నెలలో రూ.3, 847.17 కోట్ల వేతనాలు చెల్లించింది.
  6. పెన్షన్లకు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 1,331.75 కోట్లు చెల్లిస్తే మేలో రూ. 2,627.79 కోట్లకు పెరిగింది. 
  7. గతేడాది మేలో ప్రభుత్వం మొత్తం వ్యయం రూ.28,171.25 కోట్లు కాగా ఈ ఏడాది రూ.28,493.77కోట్లుగా కాగ్ చెప్పింది.
  8. ఈ ఏడాది మే నెలలో ప్రభుత్వం రూ. 7,380.27 కోట్ల అప్పులు చేసింది. అదే గతేడాది మేలో ప్రభుత్వం రూ. 9,266. 42కోట్ల రుణాన్ని తీసుకుంది.  వచ్చే నెలలో రేవంత్ ప్రభుత్వం 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో నెలవారీగా ఖర్చులు, వ్యయాలను లెక్కించి అంచనాలను రూ పొందించడంలో ఈ కాగ్ రిపోర్టులోని లెక్కలు కీలకంగా మారనున్నాయి.