23 July, 2026 | 8:21 PM

సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి రూ.18 లక్షలు కుచ్చుటోపీ

29-06-2024 12:05 AM
  • ఫెడెక్స్ కొరియర్ పేరుతో మోసం

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

11 నిమిషాల్లో రూ. 18 లక్షలు ఫ్రీజ్

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల చాకచక్యం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): సైబర్ నేరాల తీరుపై ప్రజలకు తరచూ అవగాహన కల్పిస్తున్నా పలువురు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఫెడెక్స్ కొరియర్ పేరిట ఫోన్లు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ దోచుకుంటున్నారు. ఆ సైబర్ క్రైమ్ ఉచ్చులో అంబర్‌పేట ఏరియాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(31) చిక్కుకున్నాడు. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఫెడెక్స్ కొరియర్‌లో ‘మీ’ ఆధార్‌కార్డు ఉపయోగించి ముంబై నుంచి ఇరాన్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, దీనిపై కేసు కాకుండా ఉండాలంటే ‘మీరు’ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులతో మాట్లాడాలని సూచించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని  నమ్మించడానికి తన పేరుతో పలు ఫోర్జరీ పత్రాలు కూడా పంపించారు.

నిజమని నమ్మిన బాధితుడు వారి నుంచి వచ్చిన స్కైప్ కాల్‌ను ఆక్సెప్ట్ చేశాడు. దీంతో బాధితుడితో సైబర్ క్రైమ్ పోలీసుల మంటూ పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు కేసు విచారణ నిమిత్తం బాధితుడి ఖాతాలో ఉన్న మొత్తాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేయాలని, విచారణ పూర్త య్యాక తిరిగి పంపిస్తామని చెప్పారు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన బాధితు డు తన ఖాతాలో డబ్బు లేకపోగా, వెంటనే ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.18 లక్షలు లోన్‌గా తీసుకుని వారు సూచించిన ఖాతా కు బదిలీ చేశాడు. కానీ, ఎంతకి డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సీసీఎస్(సైబర్ క్రైమ్ పోలీసులకు)ను ఆశ్రయించాడు.  

11 నిమిషాల్లో  ఫ్రీజ్

బాధితుడు గురువారం సాయంత్రం 6.58 గంటలకు సీసీఎస్‌కు చేరుకుని కానిస్టేబుల్ ఎన్.శ్రీకాంత్‌నాయక్‌ను కలిశాడు. తను మోసపోయిన తీరును వివరించాడు. దీంతో కానిస్టేబుల్ వెంటనే (నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) ఎన్‌సీఆర్‌పీ పోర్టల్ లో బాధితుడి బ్యాంకు ఖాతా వివరాలు, అతను డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసిన ఖాతా వివరాలను నమోదు చేశారు. దీనిపై స్పందిం చిన ఎన్‌సీఆర్‌పీ సిబ్బంది సైబర్ నేరగాళ్ల ఖాతాను బ్లాక్ చేసి, వారి ఖాతాలో ఉన్న రూ.18 లక్షలను సైబర్ నేరగాళ్లు వినియోగించుకోకుండా హోల్డ్ చేశారు. 7.09 గంటల వరకు ఈ ప్రక్రియ పూర్తయింది. కేవలం 11 నిమిషాల్లోనే రూ.18 లక్షలు ఫ్రీజ్ అయ్యా యి. సైబర్ క్రైమ్ జరిగినట్లు గుర్తించిన బాధితులు గంటలోపు మెయిల్ ఐడీ.. cyber crime.gov.in, టోల్ ఫ్రీ నం. 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్ల అకౌంట్లను ఫ్రీజ్ చేయవచ్చని, డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుందని సైబర్ క్రైమ్ డీసీపీ డి.కవిత తెలిపారు.