10 April, 2026 | 12:28 AM

డాక్టర్ శ్రీలీల

12-02-2026 01:55 AM

తెలుగు, కన్నడచిత్ర రంగాల్లో అ గ్ర కథానాయికగా దూసుకుపోతున్న శ్రీలీల తన జీవితంలో ఒక మైలు రాయిని చేరుకున్నారు. ఒకవైపు నటిగా బిజీ బిజీగా ఉంటూనే ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేశారు. మంగళవారం రాత్రి ఈమేరకు ముంబైలోని డీవై పాటిల్ మెడికల్ కాలేజీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆమె మెడికల్ డిగ్రీ పట్టా అందుకున్నారు.

గ్రాడ్యుయేషన్ డ్రెస్, టోపీ ధరించి శ్రీలీల పట్టా పట్టుకుని ఆనందోత్సాహల్లో మునిగితేలుతున్న ఆమె ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. నటనలో తనదైన మార్క్ చూపిస్తూ, షూటింగ్‌లకు హాజరవుతూ కూడా ఆమె వైద్య విద్యను పూర్తి చేయడం, ఆమె క్రమశిక్షణకు నిదర్శనమని అభిమానులు కొనియాడుతున్నారు.

‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన ‘తు మేరీ జిందగీ హై’ అనే చిత్రంతో ఆమె ఉత్తరాదికి పరిచయం కాబోతున్నారు. అలాగే టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటిస్తున్నారు.