12 August, 2026 | 3:47 PM

హైదరాబాద్ కేంద్రంగా ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్

25-05-2024 01:51 AM

ప్రధాన సూత్రధారి హైదరాబాద్ వైద్యుడు

ఒక్కో కిడ్నీ ధర రూ.20 లక్షలు

కేరళ పోలీసుల అదుపులో ముఠా సభ్యుడు సబిత్

విచారణ నిమిత్తం నగరానికి చేరుకున్న ఎన్‌ఐఏ బృందం

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (విజయక్రాంతి) : హైదరాబాద్ కేంద్రంగా కొన సాగుతున్న అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ము ఠా గుట్టురట్టయ్యింది. హైదరాబాద్, బెంగుళూరుకు చెందిన పేద యువకులకు అధిక డబ్బు ఆశచూపి ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీలను విక్రయిస్తున్న ముఠాలోని సభ్యుడిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ రిపోర్టులోని వివరాల ప్రకారం.. సబిత్ ఈ వృత్తిలోకి రావడానికి హైదరాబాద్‌కు చెందిన వైద్యుడే ప్రధాన కారణమని దర్యాప్తు బృందం తేల్చింది.

2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించడం ద్వారా హైదరాబాద్ వైద్యుడు, సబిత్ మధ్య పరిచ యం మొదలైంది. ఆ వైద్యుడి సహకా రంతో బెంగళూరు,హైదరాబాద్ నుంచి 40 మంది యువకులను ఇరాన్ తీసుకెళ్లి, వారి కిడ్నీలు విక్రయిస్తున్నాడు. డబ్బు అవసరం ఉన్న పేద యువతకు డబ్బు ఆశ చూపి, కిడ్నీలు విక్రయించేలా ఒప్పిస్తున్నాడు. వారికి కావాల్సిన పాస్‌పోర్టు, వీసాల వంటివి మరి కొందరు దళారులు సమకూర్చి.. ఇరాన్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో బాధిత యువకుల్లో ఒకరు మృతి చెందడం తో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేశారు. ముఠాలోని కీలక సభ్యుడు సబిత్ ఇరాన్ నుంచి కొచ్చి రాగా, గత ఆదివారం అతన్ని కొచ్చి విమానాశ్రయంలో కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అంగమాలి కోర్టులో హాజరుపరిచారు. ఇరాన్‌లో రక్తసంబంధీకులు కానివారు అవయవాలు దానం చేసేందుకు అనుమతి ఉందని, అందుకే అక్కడికి తీసుకెళ్తున్నారని దర్యాప్తులో తేలింది. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు రూ.20 లక్షల వరకు ఇస్తామని నమ్మించి.. చివరకి రూ.6 లక్షలు ముట్టజెబుతున్నట్లు అధికారులు గుర్తించారు.