భారత్ అమ్ముల పొదిలోకి కమికాజే డ్రోన్లు
- జీపీఎస్ పనిచేయని చోటకూ చొచ్చుకుపోనున్న ఆయుధం
- ఎన్‌ఏఎల్ ఆధ్వర్యంలో ఈ ఆత్మాహుతి ఆయుధం తయారీ
న్యూఢిల్లీ, ఆగస్టు 16: నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (ఎన్‌ఏఎల్) పూర్తి స్వదేశీ సాంకేతికతో భారత్ అమ్ముల పొదిలోకి మరో అద్భుతమైన అస్త్రాన్ని చేర్చబోతున్నది. ఆ ఆత్మాహుతి ఆయుధం పేరే ‘కమికాజే’ డ్రోన్. 2.8 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పుతో ఉండే ఈ డ్రోన్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెయ్యి కిలోమీటర్ల మేర ప్రయాణించి రాడార్లు, శత్రువుల రక్షణ వ్యవస్థల కళ్లుగప్పి శత్రుమూకలపై దాడి చేయగలదు. డ్రోన్ గగన తలంలో సుమారు తొమ్మిది గంటలు ఉండగలదు. రిమోట్ కంట్రోల్‌తో డ్రోన్‌ను ఆపరేట్ చేయవచ్చు.
జీపీఎస్ పనిచేయని చోటు అయినా అక్కడ ప్రయోగించేలా డ్రోన్‌కు రూపకల్పన జరుగుతోంది. శాస్త్రవేత్తలు వీటి తయారీకి 30 హెచ్‌పీ ఇంజిన్లను ఉపయోగించనున్నారు. ఈ తరహా డ్రోన్ల వినియోగం ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా యద్ధంలో సంభవించింది. రష్యా దళాలను టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ డోన్లను ప్రయోగించి మెరుగైన ఫలితాలు సాధించింది.






