20 June, 2026 | 8:39 PM

Breaking News

బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా   •   మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ   •   సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •  

20న వరంగల్‌లో రైతు కృతజ్ఞత సభ?

17-08-2024 12:39 AM
  1. రాజీవ్‌గాంధీ జయంతి నేపథ్యంలో తెరపైకి ఆ తేదీ.. 
  2. ఆదేరోజు రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణకూ అవకాశం 
  3. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ రాకపై లేని స్పష్టత

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): వరంగల్ వేదికగా 2023 మే 6న అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ సభ నిర్వహించిది. సభలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్ఠానం ‘రైతు కృతజ్ఞత సభ’ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకు దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి అయిన ఆగస్టు 20వ తేదీని ఎంచుకున్నారని, ఇప్పటికే పార్టీ నేతలు సభ ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు సమాచారం.

ఇదే అంశంపై ఆదివారం జరుగనున్న సీఎల్పీ సమావేశంలోనూ చర్చించనున్నట్లు తెలిసింది. సభకు పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వచ్చే అవకాశం ఉందని, కానీ ఇప్పటికే వారి రాకపై స్పష్టత లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సోనియాగాంధీ చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ సోనియాగాంధీ రాకపై క్లారిటీ లేదు. 24వ తేదీ తర్వాత సోనియాగాంధీ సమయం ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ పనులను శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్  పరిశీలించారు.