31 July, 2026 | 2:25 AM

డ్రగ్స్ ముఠా అరెస్టు

24-06-2024 12:10 AM
  1. చైతన్యపురి, ఎల్బీనగర్‌లో పక్కా సమాచారంతో ఎస్‌వోటీ పోలీసుల దాడులు
  2. రూ. కోటి విలువైన డ్రగ్స్ స్వాధీనం

ఎల్బీనగర్, జూన్ 23: వేర్వేరు ప్రాంతాల్లో నిషేధిత మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను ఎల్బీనగర్, చైతన్యపురి, వనస్థలిపురం పోలీసుల బృందం అరెస్టు చేశారు. ముఠా సభ్యుల నుంచి హెరాయిన్, ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లో నివాసం ఉండే విర్మరామ్(24) డ్రైవర్‌గా పని చేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడు.

అలాగే రాజస్థాన్‌కు చెందిన దినేశ్‌కల్యాణ్ అలియాస్ దినేశ్‌కుమాన్, హీరారామ్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. అయితే సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో నగరంలో డ్రగ్స్ పెడ్లర్, ఆన్‌లైన్ క్యాష్ రిసీవర్ అవతారం ఎత్తారు. శనివారం సాయంత్రం చైతన్యపురి మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించి విర్మరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ఇతడి నుంచి 30 గ్రాముల హెరాయిన్, సెల్‌ఫోన్ 1, పది మొబైల్ స్క్రీన్‌గార్డు బాక్సులు, ఒక టేపు, ఒక తూకం వేసే మిషన్‌తో పాటు రూ.కోటి విలువైన మత్తు పదార్థాలను రూ.4 లక్షల నగదును  స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విర్మరామ్‌పై ఇతర కేసులు కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వీరి ముఠాలోని హీరారామ్, దేనేశ్‌కల్యాణ్ పరారీలో ఉన్నారని, త్వరలోనే అరెస్టు చేస్తామనితెలిపారు.  

ఎల్బీనగర్ డీమార్ట్ ప్రాంతంలో..

22వ తేదీన ఎల్బీనగర్, వనస్థలిపురం ఎస్‌వోటీ పోలీసులు పక్కా సమాచారంతో ఎల్బీనగర్‌లోని డీమార్ట్ దగ్గర డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తులను పట్టుకుని, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. జగదేవ్‌పూర్ మండలం సిద్దిపేటకు చెందిన జుర్రు ఆకాశ్ (20), సిద్దిపేట జిల్లా దర్మారం గ్రామానికి చెందిన మొగిలి వెంకటేశ్(23) ఇద్దరు స్నేహితులు. వీరు గతంలో కర్కపట్లలోని ఒక ఫార్మా కంపెనీలో పని చేస్తూ డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. తర్వాత డ్రగ్స్‌ను సేకరించి, విక్రయిస్తున్నారు. 

ఈ క్రమంలో డ్రగ్స్ సరఫరాదారుడు హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌కు చెందిన శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడటంతో ముగ్గురు కలిసి డ్రగ్స్‌ను విక్రయిస్తుండగా పట్టుకున్న పోలీసులు వీరి నుంచి ఎండీఎంఏ 2 గ్రాములు, 2 సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా బాచుపల్లి, జిన్నారం మండలాల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో రూ.22 లక్షల విలువైన 80.50 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు సీఐ సుభాష్‌చందర్ తెలిపారు. ఆదివారం బాచుపల్లిలో గంజాయి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసలు సోదాలు నిర్వహించగా వికాస్, తుకారాం అనే వ్యక్తుల వద్ద నుంచి 4.50 కిలోల గంజాయి లభించింది. వారి ఇళ్లలో తనిఖీలు నిర్వహించగా మరో 76 కిలోల గంజాయి లభించింది. ఇళ్ల వద్ద గంజాయి విక్రయిస్త్ను అంకుష్, పుష్ప అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితుల వద్ద నుంచి రెండు ఆటోలు, ఒక బైక్, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై వెంకట్, అనిల్ పాల్గొన్నారు. వారిని డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, ఏఈఎస్ జీవన్‌కిరణ్ తదితరులు అభినందించారు. 

గంజాయి విక్రేత అరెస్ట్

నగరంలోని లోయర్ దూల్‌పేట్, మల్సిపూర్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్‌ఎఫ్‌టీ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.3.50 లక్షల విలువైన 17.1 కిలోల గంజాయిని స్వాధీ నం చేసుకున్నారు. ఎస్‌ఎఫ్‌టీ ఎక్సైజ్ సూపరిండెంట్ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దినేష్ సింగ్ అనే వ్యక్తి కర్ణాటకకు చెందిన సోంపాల్‌రావు వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తుండగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఎఫ్‌టీ ఎస్‌ఐ సాయి కిరణ్, సిబ్బంది యాదగిరిరాజు, మహేష్, రజనీకాంత్ పాల్గొన్నారు.