క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు!
- సూత్రప్రాయంగా మంత్రి సీతక్క ఆమోదం
- త్వరలో ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): మహిళా సాధికారత నినాదాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్త్రీలతో నడిచే క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు పెట్టాలని భావిస్తున్నది. ఇందిరాగాంధీకి తెలంగాణతో ఉన్న అనుబంధం, మహిళల స్వావలంబన కోసం ప్రవేశ పెట్టిన పథకాలను స్ఫూర్తిగా తీసుకుని స్వయం సహాయక బృందాలు, మహిళలతో నడిచేలా రాష్ట్ర ప్రభుత్వం ఉనికిలోకి తేవాలనుకుంటున్న క్యాంటీన్లకు ఆ పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నది. ఏపీలో అన్న క్యాంటీన్, తమిళనాడు అమ్మ క్యాంటీన్, పశ్చిమ బెంగాల్లో దీదీ కా రసోయి తదితర పేర్లతో ఇప్పటికే నడుస్తున్న క్యాంటీన్లను అధ్యయనం చేసి ఇందిరమ్మ పేరును పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.
ఇక అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడమే మిగిలింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నడవనున్న ఈ క్యాంటీన్ వ్యవస్థపై మంత్రి సీతక్క ఇటీవలే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో వాటి పనితీరుపై అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. రానున్న రెండేళ్లలో సుమారు 150 క్యాంటీన్లను కేవలం మహిళలతోనే నడిచేలా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రులు, క్యాంటీన్లు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్‌స్టేషన్లు, మరికొన్ని ప్రాంతాల్లో వీటిని మొదటి దశలో ఎంపిక చేశారు.
ఇవన్నీ మహిళల ద్వారానే నడుస్తున్న నేపథ్యంలో వాటికి మొదట మహిళాశక్తి క్యాంటీన్లు అని మంత్రి పేరును ఖరారు చేశారు. కానీ ఇందిరమ్మ పేరు పెట్టడమే సమంజసంగా ఉంటుందనే అభిప్రాయం రావడంతో చివరకు దాన్నే ఖరారు చేయాలనుకుంటున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. గత ప్రభుత్వ హాయంలో కొన్ని స్కీమ్‌లకు కేసీఆర్ పేరు పెట్టడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇండ్ల పథకానికి ఇందిరమ్మ పేరును ఖరారు చేసింది.






