వన్యప్రాణులకు దాహం.. దాహం
నీరు లేక మృత్యువాత పడుతున్న మూగజీవాలు
ఆరణ్యంలో వన్య ప్రాణులకు నీటి సౌకర్యం కల్పించడంలో విఫలం
అడవులు దాటి.. జనాల్లోకి జంతువులు
వేసవిలో ముందస్తు చర్యలు చేపట్టని అటవీ శాఖ
అడవుల్లో కొన్ని ప్రాంతాల్లో ఖాళీగా దర్శనమిస్తున్న సాసర్పిట్లు
నీటి సౌకర్యం కల్పించాలంటున్న జంతు ప్రేమికుల ఆందోళన
మణుగూరు, మార్చి 13, (విజయక్రాంతి): అడవిలో వన్య ప్రాణులు చావు కేకలతో అలమటిస్తున్నాయి. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో అటవీ ప్రాంతంలో అటవీశాఖ నిర్మించిన చెక్డ్యాంలు, కుంటలు ఎండిపోతున్నాయి. వాటిపై ఆధారపడి జీవిస్తున్న అటవీ జంతువులు దాహం దాహం అంటూ తాగునీటి కోసం పరుగులు పెడుతున్నాయి.
ప్రస్తుతం ఏ ప్రాంతం అడివిలో చూసిన బుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. తాగునీటి కోసం వన్యప్రాణులు అడవికి సమీపం లో ఉండే గ్రామాల వైపు వెళ్తూ వేటగాళ్లు, ఊర కుక్కల బారి నపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. రోడ్లు దాటే క్రమంలో వాహనాలు ఢీ కొని ప్రమాదాలకు గురై మృత్యు వాత పడుతున్నాయి. మూగజీవాల దాహార్తిఫై విజయక్రాంతి కథనం..
వన్యప్రాణుల దాహం, దాహం..
రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. జిల్లాలో 4,31 1.3 8 చదరపు కి.మీ.లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ అడవులలో పలురకాల వన్య ప్రాణులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ వేసవిలో ఎండలు తీవ్రమవుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు సైతం ఎండకు అడుగంటిపోతున్నా యి. అడవిలోని పచ్చదనం మొక్క ఎండి పోయింది. దీంతో అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు నిండా నీడ కాదు కదా దప్పిక తీర్చుకోవడానికి గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోంది.
నీటి కోసం జనావాసంలోకి వన్యప్రాణులు
జిల్లాలోని అటవీ ప్రాంతంలో చెరువులు, కుంటలలో నీరు ఎండిపోవడంతో వన్య ప్రాణులు నీటి కోసం జనావాసంలోకి వస్తున్నాయి. ప్రధానంగా అటవీ ప్రాంతం లోని జింకలు, నెమళ్లు, కోతులు, కొండ గొర్రెలు, కుందేళ్లు చుట్టు పక్కలోని గ్రామాల్లోకి, పంట పొలాల్లోకి వచ్చి దప్పికను తీర్చుకుంటున్నాయి. దీనిని అదునుగా భావిస్తున్న వేటగాళ్లు వీటిని వేటాడి చంపుతున్నారు. మరికొన్ని వన్యప్రాణులు చుట్టుపక్కలోని పంట పొలాల్లోకి నీరు తాగడానికి వస్తున్నాయి. సంబందిత రైతులు పంట పొలాల్లో పంట రక్షణ కోసం పురుగుల మందు చల్లుతుండడం తో అక్కడ నీటిని తాగి వన్యప్రాణులు మృతి చెందిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి.
అటవీ ప్రాంతంలో నీటి సౌకర్యం కల్పించడంలో అధికారులు విఫలం..
జిల్లాలో వన్యప్రాణులకు ఈ వేసవిలో దప్పిక తీర్చేందుకు అటవీశాఖ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎండలు తీవ్రంగా ఉన్నందున వన్యప్రాణుల కోసం ఆటవీ ప్రాంతంలో తాగునీటి సౌకర్యం కల్పించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. వన్యప్రాణులకు తాగునీటి సమస్య తీర్చేందుకు అటవీశాఖ ఆధికారులు ప్రత్నామ్నాయ చర్యలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ అవి ఎక్కడా కనిపించడం లేదు.
వేసవి వచ్చిందంటే అటవీ ప్రాంతంలో సాసర్పిట్లను ఏర్పాటు చేసి వాటర్ ట్యాంకుల ద్వారానే వారానికి రెండు సార్లు నీటిని అందించాల్సి ఉంటుది. ఈ నీటితో అటవీ ప్రాంతంలోని వన్య ప్రాణులు వాటి దాహార్తిని తీర్చుకునేందుకు వీలుంటుంది. మూగ జీవాలకు దప్పికను తీర్చేందుకు కొన్ని అటవీ ప్రాంతంలలో సాసర్ పిట్లను ఏర్పాటు చేసినప్పటికీ అవి నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి. అయితే కొన్ని రెంజ్ పరిధిలోని కొంత మంది అధికారులు తమ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాసర్పిట్ల లో నీటిని నిల్వ ఉంచడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు అరోపణలు వస్తున్నాయి.
సిబ్బంది సాసర్పిట్లులో నీటిని వారంలో రెండు సార్లు నింపాల్సి ఉండగా కొంత మంది ట్యాంకర్ల ద్వారా కేవలం ఒక సారి మాత్రమే నింపి చేతులు దులుపు కుంటున్నారని విమర్శలు ఉన్నాయి. దీంతో అభయారణ్యంలో ఉండే వన్యప్రా ణులు నీటి కోసం తహత హలాడుతున్నాయి. వన్య ప్రాణులకు గుక్కెడు నీళ్లు కోసం జనావా సాల్లోకి వస్తుండగా మరి కొన్ని నీళ్లు దొరకక అడవి లోనే మృత్యు వాత పడుతున్నాయి. మరికొన్ని వన్య వేటగాళ్ల ఉచ్చులో పడి మృతి చెందుతున్నాయి.
పట్టింపులేని సంబంధిత శాఖ
జిల్లాలోని అటవీ ప్రాంతంలో తాగునీటి కోసం వన్యప్రాణులు చావు కేకలు పెడుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టింపులేక ఉంటున్నారు. అటవీ జంతువులు దాహార్తిని తీర్చేందుకు కొంతమంది సంబంధిత అధికారులు చర్యలు తీసు కోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అరోపణలు వస్తున్నాయి. అడవుల్లో నీరు లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు సాసర్పిట్లలో వాటర్ట్యాంకుల ద్వారా మూడు లేదా నాలుగు సార్లు నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తోంది. ఒకవేళ నిధులను కేటాయించక పోయిన సంబంధిత శాఖ వారు వేరే నిధులు వేసులుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అడవుల్లో నీరు దొరకక వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నట్లు జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధితశాఖ ఉన్నతాధికారులు స్పందించి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దప్పిక తీర్చేందుకు నీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.




