ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కొరడా
- ఇందిరా పార్కు వద్ద ఫుట్‌పాత్ అక్రమణల తొలగింపు
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తొలగించారు- బాధితులు
ముషీరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గం కవా డిగూడ డివిజన్ ఇందిరా పార్క్, ధర్నా చౌక్ ప్రాంతంలోని ప్రధాన రహదారికి ఇరువైపుల ఫుట్ పాత్ ఆక్రమణలపై కవాడిగూడ సర్కిల్ జీహెచ్‌ఎంసి అధికారులు శుక్రవారం కొరడా ఝళిపించారు. చిరు వ్యాపారులు కొన్ని ఏళ్లుగా ప్రధాన రహదారిపై రోడ్లు, ఫుట్ పాత్ లను ఆక్రమించిన, అక్రమ నిర్మాణలతో పాటు వెలిసిన పాన్, పండ్ల డబ్బాల ను జీహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ కిష్టయ్య, అధికారులు పోలీసుల సమ క్షంలో తొలగించారు.
రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ లపై వెలిసిన డబ్బాలను, ఫుట్ పాత్ ఆక్రమణలను జేసీపీ తో సహాయంతో తొలగించారు. ఇందిరా పార్కు చౌరస్తా నుంచి బండ మైసమ్మ నగర్ చౌరస్తా వరకు ఇందిరాపార్క్ ప్రహరీని ఆనుకొని హోటళ్లు, డబ్బాలు, తోపుడుబండ్లను ఎవరికి వారు ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగి చిరు వ్యాపారుల డబ్బాలను, గుడారాలను తొలగించడంతో ఆ ప్రాంతం లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తమ డబ్బాలను తొలగించవద్దని బాధితులు అధికారులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ఫుట్ పాత్ లను ఆక్రమించడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని దృక్పథంతో ఫుట్ పాత్‌లను తొలగిం చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా ధర్నా చౌక్‌లో తరచూ ధర్నాలు, ఆందోళనలు జరుగుతుండడంతో ప్రయాణికులకు రోడ్డు ఇరుకుగా మారడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, చిరు వ్యాపారుల అక్రమ వ్యాపారాలతో తీవ్ర ఆటంకం గా మారుతుందని జిహెచ్‌ఎంసి అధికారులు పేర్కొంటున్నారు. రోడ్డు కిరువైపులా ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే చర్యలు తప్పవని చిరు వ్యాపారులను హెచ్చరించారు.
ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తొలగించారు- బాధితులు..
జీహెచ్‌ఎంసి అధికారులు తమకు ముం దస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమ డబ్బాలను తొలగించారని బాధితులు వాపోయారు. తమకు రెండు రోజులు అవకాశం ఇవ్వాలని అధికారులను కోరినప్పటి కిని వినకుండా యుద్ధ ప్రాతిపదికన తమ డబ్బాలను తొలగించారని బాధితులు పేర్కొన్నారు. దీంతో తమ జీవితాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.




