పోలీసు అన్నయ్యలకు ముందస్తు రక్షాబంధన్
షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో వేడుకలు, రాఖీలు కట్టి, స్వీట్లు పంపిణీ
షాద్ నగర్ ఆగస్టు 27 (విజయక్రాంతి): షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో పోలీసు అన్నయ్యలకు ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేవైఎం అసెంబ్లీ ఇన్‌చార్జ్ పుట్నాల సాయికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. సీతారాంకు బీజేవైఎం నాయకులు ముందస్తు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి, స్వీట్లు అందించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో కూడా విధుల్లో ఉంటూ ప్రజలకు భద్రత కల్పిస్తున్న పోలీసుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయతకు ప్రతీక అని, పోలీసు సిబ్బందితో సోదరభావాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు. సమాజంలో శాంతి, భద్రత కోసం పోలీసులు చేస్తున్న కృషికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫరూక్‌నగర్ మండల అధ్యక్షుడు వివేక్, విజయ్, ప్రశాంత్, రాధిక, నందిని, పూజ, ఫలక్ తో పాటు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






