28 August, 2026 | 1:37 AM

జవాబు చెప్తే బెస్ట్ గిఫ్ట్ పెన్ను బుక్కు

27-08-2026 10:58 PM

భైంసా,(విజయక్రాంతి): కేజీబీవీలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ భైంసా కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు, సిబ్బంది సంఖ్య, హాజరైన వారి సంఖ్య, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రతిరోజు అందిస్తున్న భోజనం, విద్య, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, మెరుగైన వసతులను, మెనూ ప్రకారం ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలన్నారు. పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ ప్రతిరోజు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం  అందిస్తున్నారా, కల్పిస్తున్న సౌకర్యాలు, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని వాకబు చేశారు. పదవ తరగతి విద్యార్థులతో ఇప్పటివరకు పూర్తయిన సిలబస్ నుండి గణితం, భౌతిక శాస్త్రం తదితర సబ్జెక్టుల్లో పలు పాఠాలను విద్యార్థులకు చెప్పి, ప్రశ్నలను వేసి వారి నుంచి జవాబులు రాబట్టారు. జవాబులు చెప్పిన విద్యార్థులను అభినంచి, పెన్నులు బహుమతులుగా ఇచ్చారు. కష్టపడి చదువుకోవాలని తెలిపారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఎంపీడీవో నీరజ్ కుమార్, ఎంఈవో సుభాష్, ఎంపీఓ ప్రదీప్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.