28 August, 2026 | 5:17 AM

ఇండ్ల స్థలాలకోసం జర్నలిస్టుల పాదయాత్ర బాధాకరం

27-08-2026 10:47 PM

- జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

- ప్రభుత్వం స్పందించకుంటే జర్నలిస్టులతో కలసి పోరాటాన్ని ఉధృతం చేస్తాం

- బిఆర్ఎస్, సిఐటియు, జనసేన, ఎమ్మార్పీఎస్

- జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయిస్తాం : కాంగ్రెస్

కల్లూరు: ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిరంతరం శ్రమించే జర్నలిస్టులు నేడు వారి సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి పాదయాత్ర చేయటం బాధాకరమని, వెంటనే ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని బిఆర్ఎస్, జనసేన, సిఐటియు ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన పాదయాత్ర గురువారం సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండల కేంద్రానికి చేరుకుంది.

మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖదీర్ శ్రీనివాస్ రెడ్డిలు పూలమాలవేసి నివాళులర్పించారు. మండల కేంద్రానికి చేరుకున్న జర్నలిస్టుల పాదయాత్రకు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు భారీ ఎత్తున శాలువాలతో సత్కరించి పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు. మండల కేంద్రం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగింది. తాసిల్దారి కార్యాలయంలో ఉన్న అధికారికి వినతిపత్రం అందజేసి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు జర్నలిస్టులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు.

అనంతరం ఏర్పాటుచేసిన సభలో రాజకీయ పార్టీలు నాయకులు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ... గత బిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి  అమలు చేయలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని బహిరంగంగా హామీలిచ్చి మూడు సంవత్సరాలుగా కాలయాపన చేస్తుందే తప్ప వారి హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వ స్పందించకపోతే జర్నలిస్టులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇళ్ల స్థలాలు సాధిస్తామని అన్నారు. 

కాంగ్రెస్ మండల అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీని అమలుపరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మట్ట రాగమయి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కట్ట అజయ్ బాబు, లక్కినేని రఘు, మేకల కృష్ణ, జనసేన పార్టీ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ ఉస్మాన్, ఉబ్బన రాంబాబు, సిఐటియు(సిపిఎం) వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టులు గంగుల గోపి, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, దాసరి డేవిడ్, సాంబశివరావు మాట్లాడారు.