29 June, 2026 | 2:01 AM

ఫోర్జరీ సంతకాలతో ఎర్నింగ్ లీవ్స్ మంజూరు

29-06-2026 01:19 AM

రూ.50వేలు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు గండి  

నిజం ఒప్పుకున్న హెచ్‌ఎం, ఉపాధ్యాయురాలు 

ఇద్దరు ఉత్తమ అవార్డు గ్రహీతలే

సిద్దిపేట, జూన్ 28 (విజయక్రాంతి): జిల్లాలోని కొండపాక మండలంలోని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఓ మహిళా ఉపాధ్యాయురాలికి తప్పుడు ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఎర్నింగ్ లీవ్స్ మంజూరు చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైంది.

2018లో చే ర్యాల కస్తూర్బా పాఠశాలలో ప్రత్యేక శిక్షణ శిబిరాలు జరిగినట్లుగా నకిలీ రికార్డులు సృష్టించి, జిల్లా విద్యాధికారి, కస్తూర్బా విద్యాలయం ప్రత్యేక అధికారి సంతకాలను ఫోర్జరీ చేసి పత్రాలు తయారు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విచారణ లో 2018లో ఎలాంటి శిబిరాలు నిర్వహించలేదని, 2019లో మాత్రమే ప్రత్యేక శిబిరా లు జరిగాయని తేలడంతో ఈ మొత్తం వ్యవహారం బట్టబయలైంది.

తప్పుడు పత్రాల ఆ ధారంగా లక్షల రూపాయల విలువైన ఎర్నింగ్ లీవ్స్‌ను నగదుగా మార్చుకున్న మహిళా ఉపాధ్యాయురాలు, ఇందుకు ప్రధానోపాధ్యాయుడికి రూ.50 వేలు ఇచ్చినట్లు విచారణ అధికారుల ముందు నిజం ఒప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిద్దరూ ఉత్తమ అవార్డు గ్రహీత ఉపాధ్యాయులే.  ఈ హెచ్‌ఎం గతంలో కూడా పలువురు టీచర్లకు ఇదే తరహాలో ఎర్నింగ్ లీవ్స్ మంజూరు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతిని ధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాధికారిని వివరణ కోసం సంప్రదించగా సెలవులో ఉన్నట్లు చెప్పారు.