29 June, 2026 | 1:37 AM

క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలం

29-06-2026 01:15 AM

మున్సిపల్ చైర్‌పర్సన్- అనూష సతీష్ భండారి  

ఆదిలాబాద్‌లో ‘రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ ప్రారంభం

ఆదిలాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ అనూష సతీష్ భండారి తెలిపారు. దేశంలో ఐఐటీ-జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యాసంస్థలు ఆదిలాబాద్‌లోని మంగళమూర్తి హోటల్స్ వేదికగా ‘రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ను ప్రారంభించింది. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష సతీష్ భండారి ముఖ్య అతిథిగా హాజరై ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అనూష సతీష్ భండారి మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదిలాబాద్ ఫౌండేషన్ కోచింగ్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థలను అభినందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. క్రమశిక్షణతో కూడి న అభ్యాసం, స్పష్టమైన అవగాహన, సరైన మార్గదర్శకత్వం విద్యార్థుల భవిష్యత్తు విజయాలకు కీలకమన్నారు.

విద్యార్థులు చిన్న వయస్సులోనే క్రమబద్ధమైన విద్యా శిక్షణ ద్వారా భవిష్యత్తు పోటీ పరీక్షలకు బలమైన పునాదిని ఏర్పరచుకోవచ్చని తెలిపారు. ఈ ఫౌండేషన్ కోర్సు ద్వారా విద్యార్థులకు వివి ధ అంశాలలో సమగ్ర శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ప్రారంభ దశలోనే బలమైన పట్టు సాధించడం ద్వారా విద్యార్థులు భావనాత్మక అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోగలరని చెప్పారు.

దీంతో ఇంటర్ అనంతరం ఐఐటీ-జేఈఈ, నీట్ వంటి పోటీ ప్రవేశ పరీక్షలలో సులభంగా విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమబద్ధమైన బోధనా పద్ధతులు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి రెసోనెన్స్ కట్టుబడి ఉందన్నారు.

ఈ ఫౌండేషన్ సెంటర్ విద్యార్థులకు ప్రాథమికాంశాలను బలోపేతం చేసుకోవడానికి, ఐఐటీ-జేఈఈ, నీట్, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవడానికి సహాయపడు తుందని తెలిపారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రారంభ దశలోనే ప్రిపరేషన్ మొదలుపెట్టడం, సంపూర్ణ అవగాహనతో కూడిన అభ్యాసం, కెరీర్ ఆధారిత విద్యా ప్రణాళిక ప్రాముఖ్యతను వివరించారు.