పరిహారం విడుదలకు ఈసీ గ్రీన్‌సిగ్నల్
పంట నష్టపోయిన రైతులకు గుడ్ న్యూస్
నేడో రేపో రైతుల ఖాతాల్లో డబ్చు జమ
మొత్తం రూ.18.81 కోట్ల పరిహారం
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 16 నుంచి 24 వరకు ఈదురు గాలులు, వడగండ్ల వానల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 15,814 ఎకరాల్లో వివిధ పంటలు నష్టపోయినట్టు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. మొత్తం రూ.18.81 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ నిధుల విడుదలకు సిద్ధమైంది. ఈలోగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కరువు విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో రైతులకు పంట నష్టపరిహారం పంపిణీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీకి విజ్ఞప్తిచేసింది. ఈసీ ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో సోమ లేదా మంగళవారాల్లో డబ్బు జమ కానున్నది.




