వాటర్ ట్యాంక్‌తో నీటి సరఫరా సర్పంచ్ ఆదర్శం
చివ్వెంల,(విజయక్రాంతి): ప్రజల కష్టాలను చూడలేక సర్పంచ్ స్వయంగా ముందుకు వచ్చి నీటి సమస్యను తీర్చిన ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని బద్య తండా గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. గ్రామంలో నెలకొన్న తీవ్ర తాగునీటి కొరతను గమనించిన సర్పంచ్ బానోత్ సైదా నాయక్, అధికారుల నిర్లక్ష్యాన్ని పక్కనపెట్టి చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ సిబ్బంది సహకారం లేకపోయినా, ఆయన వెనుకడుగు వేయకుండా స్వయంగా ట్రాక్టర్‌ను నడుపుతూ వాటర్ ట్యాంక్ ద్వారా తండాలోని ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేశారు.
సర్పంచ్ స్వయంగా డ్రైవర్‌గా మారి ప్రజలకు నీళ్లు అందించడం చూసిన గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. “మా సమస్యను ఎవరూ పట్టించుకోని సమయంలో సర్పంచ్ స్వయంగా ముందుకు వచ్చి నీళ్లు అందించడం మాకు ఎంతో ఉపశమనం కలిగించింది” అని తండా వాసులు తెలిపారు. ఈ చర్యతో సర్పంచ్ బానోత్ సైదా నాయక్ గ్రామంలో ఆదర్శంగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ప్రజా ప్రతినిధులు ఇలాంటి సేవా దృక్పథంతో ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు.




