9 May, 2026 | 8:15 AM

పర్యావరణహిత పక్షులు

09-05-2026 12:00 AM

నేడు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం :

కొన్ని ప్రత్యేక ప్రాంతాలు లేదా దేశాల నుంచి నియమిత సీజన్లలో సుదూరం పయనించి వచ్చి చేరే వలస పక్షులు ప్రకృతి విందులను ఆరబోస్తూ, చూపరులకు కనువిందు చేస్తాయి. వలస పక్షుల వల్ల విత్తనాలు, పుప్పొడి వ్యాప్తితోపాటు కీటకాలు నియంత్రణలోకి వస్తాయి. తద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతోంది. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించి జీవవైవిధ్యం, దేశాల మధ్య సహకారాలకు ప్రతీకలుగా వలస పక్షులు ఉపయోగపడుతున్నాయి.

వలస పక్షులకు అవసరమైన ప్రకృతి విధ్వంసం కావడం, వాతావరణంలో ప్రతికూల మార్పులు చోటుచేసుకోవడం, వేటల రూపంలో మానవ ప్రమేయం పెరగడంతో వలస పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లడంతో పర్యావరణ సహజత్వం కాపాడటం, ప్రజల జీవనోపాధిని నిలబెట్టడం, పంటలకు పట్టే తెగుళ్లు-, కీటకాలను నియంత్రించడం, పరాగ సంపర్కానికి దోహదపడటం, విత్తన వ్యాప్తి చేయడం, పోషకాలను రవాణా చేయడం లాంటి ప్రయోజనాలు ఒనగూడుతాయి.

దండయాత్ర, ఆక్రమణ, వలసవాదం, వలస వెళ్లడం లేదా వలస రావడం అనే నాలుగు వలస పక్షుల రూపాలు ఉంటాయి. వలస పక్షుల్లో అధికంగా ఆహారం, సంతానోత్పత్తి, తమ పిల్లల్ని పెంచడం కోసం సరైన వాతావరణ పరిస్థితులను వెతుక్కుంటూ, వేల మైళ్లు ప్రయాణించి మెరుగైన ప్రకృతి కలిగిన ప్రదేశాలకు వలసలు వెళ్తాయి. భారతదేశంలో పక్షి జాతుల పరిరక్షణకు ఏటా జనవరి 5న ‘జాతీయ పక్షుల దినోత్సవం’ పాటించడం ఆనవాయితీగా మారింది.

శీతాకాలంలో భారతదేశానికి వలస పక్షులు చేరడంతో పక్షి ప్రేమికుల సందర్శనాలు, వాటి సంరక్షణకు పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. వలస పక్షుల దినోత్సవాన్ని శరత్కాలంలో అక్టోబర్ 10న కూడా నిర్వహించడాన్ని మనం చూస్తున్నాం. వలస పక్షుల పరిరక్షణకు అవసరమైన అంతర్జాతీయ సహకారం గురించి అవగాహన పెంచడానికి ప్రపంచ వలస పక్షుల దినోత్సవ వేదికలు సమర్థవంత సాధనాలుగా పని చేస్తాయి.

వలస పక్షులను వీక్షించడానికి ప్రత్యేక ‘వలస పక్షి వీక్షణ యాత్రలు’ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. వలస పక్షులు ఒక ప్రకృతి అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,000 రకాల వలస పక్షి జాతులు ఉన్నాయి. చాలా వలస పక్షులు ఉత్తర ప్రాంతాల నుంచి దక్షిణ శీతల విడిది ప్రాంతాలకు చేరతాయి. కొన్ని వలస పక్షి జాతులు దక్షిణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి చేసి తేలికపాటి ఉత్తర శీతాకాల తీర ప్రాంతాలకు వస్తాయి.

ఇతర వలస పక్షులు శీతాకాల మాసాల్లో పల్లపు ప్రాంతాల్లో నివసించి, వేసవిలో పర్వత ప్రాంతాలకు చేరతాయి. ఏటా శీతాకాలంలో సైబీరియా, యూరప్, మధ్య ఆసియా దేశాల నుంచి చలిని తట్టుకోవడానికి, ఆహారం కోసం వేలాది కిలోమీటర్లు ప్రయాణించి లక్షలాది వలస పక్షులు భారతదేశంలోకి చిత్తడి నేలలు, సరస్సులకు వలసలు వస్తాయి.

అత్యంత ఎత్తులో ఎగిరే బార్-హెడెడ్ గూస్, సైబీరియన్ క్రేన్, అముర్ ఫాల్కన్, డెమోయిసెల్ క్రేన్, గ్రేటర్ ఫ్లెమింగో, రఫ్, ఉత్తర షోవెలర్, రోసీ పెలికాన్, గాడ్వాల్, గాడ్విన్, స్పాటెడ్ రెడ్‌షాంక్, బ్లూత్రోట్, ఆసియా కొయెల్, నల్ల కిరీట రాత్రి కొంగ లాంటి 14 రకాల వలస పక్షి జాతులు భారతదేశానికి వలసలు వస్తాయి.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రపంచ వలస పక్షుల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. 2026 ప్రపంచ వలస పక్షుల దినం ఇతివృత్తంగా ‘ప్రతి పక్షి ముఖ్యమే: మీ పరిశీలనలు విలువైనవి’ అనే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. వలస పక్షుల జనాభా, వాటి ఆవాసాలు, సంతానోత్పత్తి, వాటి మనుగడ కు ప్రమాదకరంగా  మారిన కారకాలపై విస్తృత ప్రచా రం నిర్వహించడం ప్రతి పౌరుడి బాధ్యత.

ఆవాసాల నష్టం, ప్లాస్టిక్ కాలుష్యం, వాతావరణ మార్పు ల కారణంగా ఈ పక్షుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. వలస ప క్షి జాతుల సహజ ఆవాసాలను కాపాడుకుంటూ, వాటి సందడి, సందర్శనాలను ఆసాంతం ఆస్వా దిద్దాం. వలస పక్షుల అందాల విందును అనుభవిద్దాం.

డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి

9949700037