9 May, 2026 | 8:15 AM

‘ఇండియా’లో లుకలుకలు

09-05-2026 12:00 AM

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. డీఎంకేతో ఉన్న దశాబ్దాల నాటి బంధాన్ని తెంచుకొని, తమిళగ వెట్రి కళగంతో జట్టుకట్టి కాంగ్రెస్ పార్టీ మరోసారి దీన్ని నిజం చేసింది. హస్తం పార్టీ ఇలా మిత్రపక్షాలను మార్చడం కొత్తే మీ కాదు. కానీ, ఈసారి మాత్రం కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ప్రతిపక్ష ఇండి యా కూటమిని తీవ్రంగా కుదిపేసింది. తమిళనాడులో అధికారాన్ని పంచుకోవడమే పరమావధిగా భావించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో జరిగే దుష్పరిణామాలను ఊహించలేదు.

అంతర్గత విభేదాలు, పరస్పరం విశ్వాసం లేకపోవడం, అసంతృప్తి, ఒకరిపై మరొకరు పోటీచేయడం లాంటి కారణాలతో ఇప్పటికే బలహీనంగా ఉన్న విపక్ష కూటమి డీఎంకే నిష్క్రమణతో మరిం త బలహీనపడే ఆస్కారం ఉంది. దశాబ్దకాలంగా అప్రతిహతంగా దూసుకెళ్తు న్న బీజేపీకి కళ్లెం వేసే లక్ష్యంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏర్పడిన ఇండియా కూటమి ఆ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన విషయం విదితమే.

విడిపోతే చెడిపోతామన్న విషయాన్ని మరిచిన విపక్ష కూటమి ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో దెబ్బతిన్నది. ఢిల్లీలో ఆప్ పరాజయం పాలవడం, పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రభ తగ్గడం, తమిళనాడులో ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ఓడిపోవడం లాంటి పరిణామాలను మనం చూస్తూనే ఉ న్నాం. అయితే, ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు తమ కంచుకోటలైన రాష్ట్రాల్లో ఓటమిపాలవడం కాంగ్రెస్‌కు ఒకవైపు సంతోషం కలిగి స్తుండగా, మరోవైపు ఆందోళనను రేకెత్తిస్తోంది.

ఈ పరిణామాలను రాహుల్‌గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ తమకు లభించిన మరో రాజకీయ అవకాశంగా భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని క్రమంగా పెంచుకొని మిత్రపక్షాలను లొంగదీసుకునేందుకు కాంగ్రెస్‌కు ఇదే సరైన సమయమని విశ్లేషణలు వినిపి స్తున్నాయి.

అయితే, మమతాబెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్ తదితర నేతలు కాంగ్రెస్‌కు ఆ అవకాశం ఇస్తారా, లేక హస్తం పార్టీని ఒంటరిని చేసి తృతీయ కూటమిని ఏర్పాటు చేస్తారా? అన్నది ఆసక్తికరం. సమీప భవిష్యత్తులో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ తప్పుబట్టిన నేపథ్యంలో ఆయన హస్తం పార్టీని కలుపుకొనిపోతారా, లేదా ఒంటరిగా పోటీచేస్తారా? అన్నది చూడాలి. ఏదేమైనప్పటికీ ఇండియా కూటమి భవితవ్యం అఖిలేష్ నిర్ణయంపై, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వెలువడే ఫలితంపైనే ఆధారపడి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.