21 August, 2026 | 8:21 PM

గొర్రెల స్కాంలో కేసీఆర్‌పై ఈడీ కేసు

14-06-2024 01:26 AM
  1. మున్ముందు హరీశ్ రావు, వెంకట్రామి రెడ్డిపై ఈడీ ఫోకస్
  2. వారికి ముందుంది మొసళ్ల పండుగ
  3. మెదక్ ఎంపీరఘునందన్ రావు వ్యాఖ్య

మెదక్, జూన్ 13(విజయక్రాంతి): తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గొర్రెల స్కాంలో కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని అన్నారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారన్న రఘునందన్ రావు.. కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, వెంకట్రామి రెడ్డికి ముందుంది మొసళ్ల పండుగ అని వ్యాఖ్యానించారు. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారి మెదక్‌కు వచ్చిన రఘునందన్ రావును స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మెదక్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సంద ర్భంగా రఘునందన్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన గొర్రెల స్కాంపై ఈడీ ఫోకస్ పెట్టిందని అన్నారు. రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా వెంకట్రామి రెడ్డి గెలవలేదని, తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నా రు. ప్రతి సమస్యను పార్లమెంట్‌లో వినిపిస్తానని, రఘునందన్ మాటల మనిషి కాదు.. చేతల మనిషని నిరూపిస్తానని పేర్కొన్నారు. అక్కన్నపేట, చేగుంటలో అజంతా, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు విన్నవిస్తానని హామీ ఇచ్చారు. చేగుంటలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు పంజా విజయ్‌కుమార్, చల్లా నరేందర్, ప్రసాద్, ఎంఎల్‌ఎన్ రెడ్డి, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.