21 August, 2026 | 7:28 PM

కూలిన బతుకులు

14-06-2024 01:48 AM
  1. గోడ కూలి ముగ్గురు కూలీల మృతి
  2. ఒకరికి గాయాలు
  3. మంచిర్యాల కేంద్రంలో ఘటన
  4. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ 

మంచిర్యాల, జూన్ 13 (విజయక్రాంతి): గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందిన సంఘటన మంచిరాల్య జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిని ఆసుపత్రి వెనకాల యాజమాన్యం మరో భవనం నిర్మాణం చేపట్టారు. 12అడుగల సెల్లార్‌లో ఫిల్లర్ల పనులను ఎనిమిది మంది కార్మికులు చేస్తున్నారు. ఒకరి వెనక ఒకరు పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పక్క ఇంటి కంపౌండ్ వాల్ కూలింది.

అప్పటికే నలుగురు పైకి రాగా మిగిలిన నలుగురు ఎనంక హన్మంతు(45), గోలం పోశం(48), ఆత్రం శంకర్(42), మైదం రామన్నపై గోడ కూలింది. ఆత్రం శంకర్, ఎనంక హన్మంతు, గోలం పోశం మృతిచెందగా.. రామన్నకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని రామగుండం సీపీ శ్రీనివాసులు, మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహుల్, మంచిర్యాల ఆర్డీవో రాములు, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ పరిశీలించారు. 

గ్రామాల్లో విషాద ఛాయలు

గోలం పోశం, ఆత్రం శంకర్‌లది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాపూర్ గ్రామం కాగా, హన్మంతుది ఇదే మండలంలోని రుద్రాపూర్. రామన్నది గుడ్లబోరి(కౌటాల మండలం). బతుకుదెరువు కోసం మంచిర్యాలకు వచ్చి పట్టణంలోని భగవంతం వాడ, రాజీవ్ నగర్‌లో నివాసముంటూ కూలీ పని చేసుకుంటున్నారు. ముగ్గురి మృతితో భగవంతం వాడ, రాంనగర్, మందమర్రితో పాటు స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 

ఆస్పత్రి వద్ద ఆందోళన

మృతదేహాలను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించే క్రమంలో బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నందిని ఆస్పత్రి యాజమాని చంద్రయ్య ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ముగ్గురు మృతి చెందారని అంబులెన్సులను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. పోలీసులు నచ్చచెప్పి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా భవనం, సెల్లార్ నిర్మాణానికి అనుమతి ఉందా! లేదా! అనేది మున్సిపల్ అధికారులకే తెలియకపోవడం గమనార్హం.

నెల రోజుల్లో కూతురి పెళ్లి

రుద్రాపూర్‌కు చెందిన ఎనంక హన్మంతుకు భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. మరో నెల రోజుల్లో కూతురు పెళ్లి కావాల్సి ఉంది. ఇంతలోనే మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంటిలో చావు డప్పు మోగుతుందని బోరుమన్నారు. 

దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటాం: సీపీ శ్రీనివాసులు

రామగుండం సీపీ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మాట్లాడారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత కుంటుంబీకులకు న్యాయం చేస్తామన్నారు. భవన నిర్మాణంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు. భవన నిర్మాణానికి అనుమతి ఉందో, లేదో పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైదం రామన్నను పరామర్శించారు.