17-12-2025 01:05:53 AM
హైదరాబాద్, డిసెంబర్ 16 : ‘ నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఏ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.. కేవలం బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఇచ్చి న ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోలేం’ అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసులో నిందితులుగా అభియోగం మోపబడిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం ధీకి భారీ ఊరట లభించింది.
అయితే, మేజిస్ట్రేట్ ఇచ్చిన సమన్ల ఆదేశాల మేరకు కాకుండా, ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం నమో దు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే కేసు విచారణ జరగాలని స్పష్టం చేయడంతో మలుపు తిరిగింది. మంగళవారం జరిగిన నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి ఈడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
దర్యాప్తును నిలిపివేయలేదని స్పష్టం చేసింది. అదే సమయంలో, ఈ దశలో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న సోనియా, రా హుల్ గాంధీలకు ఎఫ్‌ఐఆర్ కాపీని పొందే అర్హత లేదని కూడా కోర్టు పేర్కొంది. తాజా పరిణామంతో గాంధీ కుటుంబానికి ఈ కేసులో ఉపశమనం లభించింది.