18-02-2026 09:53:42 PM
* హుండీ ద్వారా రూ.39.87 లక్షలు
* గతేడాది కంటే రూ.26.6 లక్షలు ఆదాయం అదనం
పాపన్నపేట: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల మహాశివరాత్రి జాతరతో పాటు 19 రోజుల హుండీ ఆదాయం కలిపి మొత్తం రూ.87,56,268 ఆదాయం వచ్చినట్లు ఏడుపాయల ఆలయ ఈవో వీరేశం, దేవాదయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ వెల్లడించారు. బుధవారం దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో శ్రీ వెంకట అన్నమయ్య చారి సేవా ట్రస్ట్ సభ్యులచే గోకుల్ షెడ్ లో హుండీ లెక్కింపు జరిగింది. 19 రోజుల హుండీ లెక్కించగా 32 గ్రాముల మిశ్రమ బంగారం, 730 గ్రాముల మిశ్రమ వెండితో పాటు రూ.39,87,178 నగదు రూపకంగా వచ్చాయి.
మహా జాతరలో లడ్డు ప్రసాదం, విక్రయించగా రూ.22,48,640, పులిహోర విక్రయానికి రూ.10,25,630, వంద రూపాయల స్పెషల్ టికెట్ దర్శనానికి రూ.10,09,600, 20 రూపాయల స్పెషల్ టికెట్ దర్శనానికి రూ.3,59,420 ఆదాయం రాగా, ఒడి బియ్యానికి రూ.69,200, కేశ ఖండడానికి రూ.56,600 వచ్చినట్లు వారు వెల్లడించారు. గత ఏడాది 16 రోజుల హుండి రూ.24,56,277 ఆదాయం కలుపుకొని రూ.61,50,237 ఆదాయం రాగా.. ఈ ఏడాది 19 రోజుల హుండి కలుపుకోని రూ.26,06,031 ఆదాయం అధికంగా వచ్చినట్లు వారు వెల్లడించారు . ఈ కార్యక్రమంలో పాపన్నపేట ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.