10 March, 2026 | 12:20 AM

మంత్రివర్గ విస్తరణకు ప్రయత్నాలు

15-12-2025 01:10 AM
  1. క్యాబినెట్‌లోకి వెళ్లను.. పార్టీ పదవిలోనే ఉంటా 
  2. తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదే
  3. బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో భవిష్యత్ లేదు 
  4. పార్టీ బలోపేతంపై రాహుల్‌గాంధీ దిశానిర్దేశం 
  5. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ప్రయ త్నాలు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఈ విస్తరణ విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని తెలిపారు.  తాను క్యాబినెట్‌లోకి వెళ్లనని, పార్టీ పదవిలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వయంప్రతిపత్తి గల సంస్థలను  నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను జేబు సంస్థగా మార్చుకుందని విమర్శించారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా ఆదివారం  కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేపట్టిన ర్యాలీకి మహేష్‌కుమార్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీసీసీ పదవుల్లో బీసీలకు పార్టీలో ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్యూచర్ సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారని, భవిష్యత్‌లో హైదరాబాద్‌తో ఎవరూ పోటీ పడని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని మహేష్‌కుమార్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో  బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదని, బీజేపీ ఎన్నటికీ అధికారంలోకి రాదన్నారు. సోషల్ మీడియాను కేటీఆర్ మేనేజ్ చేస్తున్నారని, బీఆర్‌ఎస్ పార్టీని నడిపించే సత్తా లేదన్నారు. కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న అభిమానం కేటీఆర్‌పై లేదని పేర్కొన్నారు.

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రాహుల్‌గాంధీతో కలిసి ఒకే విమానంలో ప్రయాణించినప్పుడు పలు కీలక అంశాలపై చర్చ జరిగిందన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై రాహుల్‌గాంధీ దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఫలితాలు, జూబ్లీహిల్స్ ఫలితాలపై రాహుల్ గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారని తెలిపారు. దేశ, విదేశాల్లోని రాజకీయ పరిస్థితు లపై చర్చించుకున్నామని తెలిపారు.