ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు కృషి చేయాలి
– గ్రంథాలయ కమిటీ చైర్మన్ కామ్డే అనిల్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరేలా ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని గ్రంథాలయ కమిటీ చైర్మన్ కామ్డే అనిల్ అన్నారు. శనివారం ఎం.పి.యు.పి.ఎస్. కైరగాం పాఠశాలలో నిర్వహించిన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.
విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, విద్యార్థి కిట్లు, రెండు జతల యూనిఫారాలు, పౌష్టికాహారం అందజేస్తోందని తెలిపారు. త్వరలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరేలా కృషి చేయాలని, వారికి నాణ్యమైన విద్య అందేలా చూడాలని అన్నారు. గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థుల నమోదును మరింత పెంచాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేసి, స్వయంగా బిస్కెట్లు, కంపాస్ బాక్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మెకార్తి వెంకటేశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునార్కర్ అనిల్ కుమార్, గ్రామ సర్పంచ్ ముంజం రూపేశ్వర్, ఉపాధ్యాయులు సంధ్యారాణి, సుజాత, సరిత, పంచాయతీ కార్యదర్శి సాధన, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






