17 April, 2026 | 3:23 AM

ప్రతి గ్రామపంచాయతీని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలి

17-04-2026 12:00 AM

 జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ప్రతి గ్రామపంచాయతీ నీ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జూలూరుపాడు రైతు వేదికలో గురువారం మండల స్థాయి సభను నిర్వహించారు. ఈ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండలంలో రహదారుల భద్రత అర్రైవ్ అ లైవ్, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, వైద్యశాఖ, మిషన్ భగీరథ, ఇరిగేషన్, మహిళ సంఘాలు వంటి వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను అధికారులు సభలో తెలియజేశారు. అనంతరం సర్పంచులు తమ గ్రామాలలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో సమస్యలను గుర్తించి పరిష్కరించే ప్రక్రియ వేగవంతమవుతోందన్నారు.  ఈ సందర్భంగా  గ్రామంలో భూగర్భ జలాల్లో అధిక ఫ్లోరైడ్ సమస్య కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ప్రజాప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన కలెక్టర్, గ్రామానికి సురక్షితమైన మంచినీటి సరఫరా కల్పించే దిశగా మిషన్ భగీరథ అధికారులను తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో తాళ్లూరి రవి , అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.