23-02-2026 12:03:42 AM
కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి, ఫిబ్రవరి 2౨ (విజయక్రాంతి): పల్లెల సర్వతోముఖాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా సర్పంచులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో నిర్వహించిన ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని సర్పంచులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణలో పొందిన అవగాహనను గ్రామాల అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శక పాలన అందించడం సర్పంచుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నిధులు, విధులను సక్రమంగా వినియోగిస్తూ, అన్ని వర్గాల సమన్వయంతో గ్రామాల సమగ్రాభివృద్ధి సాధించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజల అవసరాలను గుర్తించి స్పందించాలని సూచించారు.
తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలతో మమేకమై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీలను ఆదర్శవంతమైన స్థానిక సంస్థలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో మరియు ఇన్చార్జ్ జిల్లా పంచాయతీ అధికారి జానకి రెడ్డి, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, మాస్టర్ ట్రైనర్లు మరియు ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.