23-02-2026 12:02:30 AM
కొమురవెల్లి, ఫిబ్రవరి 22: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో వారం కూడా భక్తులు పోటెత్తారు. మల్లన్న క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్న కొద్ది మల్లన్న సన్నిధానానికి భక్తుల తాకిడి ఎక్కువవుతుంది.
శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన భక్తుల రాక ఆదివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. భక్తులు తెల్లవారకముందే లేచి స్వామివారి పుష్కరిణీలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయ ద్వారం తెరవక ముందే స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ ద్వారా తెరవగానే గర్భాలయంలో ఉన్న స్వామి వారి దర్శనం చేసుకొని భక్తితో వేడుకున్నారు. మొక్కుల్లో భాగంగా పట్నాలు, బోనాలు, అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా గుట్ట పైనున్న ఎల్లమ్మ తల్లికి బోనాలు నివేదించి, ఓడిబియాలు పోసి అత్యంత భక్తిశ్రద్ధలతో ’ మమ్ము కరుణించు మని భక్తితో వేడుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు మూడున్నర గంటలకు పైగా సమయం పట్టింది.
భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ వర్గాలు, పాలకవర్గం పర్యవేక్షణ చేశారు. మల్లన్న ను దర్శించుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామిని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనములు ఇచ్చారు. ఆయన వెంట ఆలయ కార్యనిర్వాన అధికారి టంకశాల వెంకటేష్, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.