నూతన కాలనీల అభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, మార్చి 15 : పటాన్చెరు డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని నందన్ పారడైజ్ కాలనీలో ఇంటింటికి స్వచ్ఛ జలాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.
ఇందుకు అనుగుణంగా నూతన రిజర్వాయర్లు, సంపులు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలు సైతం పొదుపుగా మంచినీటిని వాడుకోవాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, స్థానిక నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.




