అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: దేశంలో నాలుగు రాష్ట్రాలతోపాటు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం అనే నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి అనే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. సార్ కు సంబంధించి బీఎస్ఓలకు మౌలిక సదుపాయాలు కల్పించామని, ఓటర్ అవగాహన కార్యక్రమాల అధికారులు, యువ ఓటర్లతో మాట్లాడామని, నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశామని సీఈసీ పేర్కొంది.
ఈ ఎన్నికలు 824 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్నాయని, ప్రతి పోలింగ్ బూత్‌లో 1200 మంది ఓటర్లకు మించకుండా, ఐదు రాష్ట్రాల్లో 2.18 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈసీ తెలిపింది. 126 మంది సభ్యులు కలిగిన అసోం శాసనసభకు ఏప్రిల్ 9, 2026న ఎన్నికలు, మే 4, 2026న ఓట్ల లెక్కింపు జరగనుంది. కేరళ శాసనసభలోని మొత్తం 140 స్థానాలకు కూడా ఏప్రిల్ 9, 2026న పోలింగ్, మే 4, 2026న ఓట్ల లెక్కింపు, అలాగే తమిళనాడు శాసనసభలోని 234 స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 23, 2026న ఒకే దశలో జరగనున్నాయి, ఓట్ల లెక్కింపు మే 4, 2026న జరుగుతుంది.
30 అసెంబ్లీ స్థానాలు కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏప్రిల్ 9, 2026న ఎన్నికలు, మిగిలిన రాష్ట్రాలతో పాటే, మే 4, 2026న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 294 మంది సభ్యులు కలిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొత్తం 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23, 2026న, మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29, 2026న ఎన్నికలు, మే 4, 2026న ఓట్ల లెక్కింపు నిర్వహించబడతాయి.
నాలుగు రాష్ట్రాలు ఆ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఒకే రోజున, అంటే 2026 మే 4, సోమవారం జరుగుతుంది. ఈ ఐదు ప్రాంతాల ఎన్నికల ప్రక్రియలన్నీ 2026 మే 6వ తేదీలోపు పూర్తయ్యే విధంగా ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందించింది. ఐదు ప్రాంతాల్లో ప్రభుత్వం కోసం జరిగే హోరాహోరీ పోరు ఇప్పటికే మొదలైంది. ఈ ఏడాది ఆరంభం నుంచే రాజకీయ పార్టీలు వివిధ కార్యక్రమాలు, బహిరంగ సభల ద్వారా తమతమ పక్షాల తరపున ముమ్మర ప్రచారం సాగిస్తున్నాయి.




