16-02-2026 12:00:00 AM
లేని పక్షంలో రాష్ట్రం అగ్నిగుండమే
తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్
ముషీరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైకోర్ట్ తీర్పు తర్వాతే చట్టబద్దంగా ఎన్నికలకు వెళ్ళాలని, లేనిపక్షంలో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నీల వెంకటేష్ ముదిరాజ్, జి. అనంతయ్య అధ్యక్షతన నిర్వహించిన 14 బీసీ సంఘాల సమావేశం జరిగింది.
ముఖ్య అతిధిగా హాజరైన ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళతామని కొన్ని వందలసార్లు ప్రకటించి మోసం చేసి సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లి బీసీలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు రాగానే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం సన్నాహాలు చేసేందుకు మంత్రులతో సీఎం సమవేశమై చర్చలు జరిపడాన్ని ఖండిస్తున్నాం అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై హై కోర్టులో నడిచే కేసు బలంగా ఉందని, ఈ కేసును తొందరగా విచారణ చేపట్టాలని కోరారు. హైకోర్టులో వేసిన మొత్తం 62 కేసులను గుర్తింపు గల సీనియర్ ఆడ్వకేట్లతో వాదింపజేసి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికి ఢిల్లీకి 64 సార్లు వెళ్లినా ఒక్కసారి కూడా బీసీ రిజర్వేషన్లపై ప్రధాన మంత్రిని కలవలేదని అన్నారు.
కనీసం అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లకపోగా పార్లమెంట్ లో కూడా చర్చ చేయలేదని మండిపడ్డారు. మున్సిపల్ చైర్మన్ల ఎంపికలో బీసీలకు జనరల్ స్థానాల్లో 50 శాతం కేటాయించాలని అన్నారు. ఈ సమావేశంలో 14 బీసీ సంఘాల నేతలు సి.రాజేందర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిలిన సతీష్ కుమార్, జిల్లపల్లి అంజి, అల్లంపల్లి రామ్ కోటి, పల్లగొర్ల రాందేవ్ యాదవ్, శివకుమార్ యాదవ్, అంజి గౌడ్, భీమ్ రాజ్, ఎం.కృష్ణయ్య, సతీష్, దాసోజు భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.