20 April, 2026 | 1:40 AM

విద్యుత్ లైన్‌మెన్ నిర్లక్ష్యం

20-04-2026 12:00 AM

మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 19(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో విద్యుత్ మరమ్మత్తు పనుల్లో విద్యుత్ లైన్ మెన్ నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ షాక్ తగిలి ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం& కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామానికి చెందిన మీనుగ వెంకటేష్(35) అనే కార్మికుడు ఆదివారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మత్తు పనులు నిర్వహించేందుకు దినసరి కూలీగా చేరాడు.

నేషనల్ మార్ట్ ముందు భాగంలో విద్యుత్తు మరమ్మత్తు పనులు జరుగుతుండగా వెంకటేష్ అనే దినసరి కూలీని మరో లైన్మెన్ జంపర్ వేసేది ఉందని బలవంతంగా మరో విద్యుత్ స్తంభాన్ని ఎక్కించాడు. కానీ ఆ లైన్ ఎల్సీ తీసుకోకుండానే కార్మికుడ్ని స్థంభం ఎక్కించడంతో విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలాడు. వెంటనే తోటి కార్మికులు, ఉద్యోగులు అతనిని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య నాగలక్ష్మి, బాబు పాప ఉన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.